World Coffee Day: ప్రపంచంలో చాలా మంది కాఫీ తాగనిదే రోజు ప్రారంభించరు. అంతగా వారి జీవితంలో మిళితమైపోయింది కాఫీ. కాఫీ మనకు మేలు చేస్తుందా లేక కీడు చేస్తుందా అన్న విషయంపై మిశ్రమ అభిప్రాయాలు ఉన్నాయి. అధ్యయనాలు కూడా మిశ్రమ ఫలితాలనే ఇచ్చాయి. అమెరికన్లలో 62 శాతం మంది కాఫీ తాగనిదే బెడ్ మీద నుంచి కూడా లేవరట. అయితే కాఫీ మగవారి సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో కొన్ని అధ్యయనాలు చెప్పాయి. 


కెఫిన్ అంటే?
కాఫీలో ముఖ్యమైనది కెఫీన్. ఇది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో అదే కాఫీ మనకు మంచి చేస్తుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. కాఫీ, కోకో,టీ, గ్వారానా వంటి మొక్కలు, పండ్లు, ఆకులు, బీన్స్ లో ఉంటుందిక కెఫీన్. ఇది కేంద్రనాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. కెఫీన్ మన శరీరంలో పూర్తిగా శోషణకు గురవుతుంది. కాఫీ తాగిన 45 నిమిషాల్లో 99 శోషించబడుతుంది. 


పురుషుల సంతానోత్పత్తిపై ప్రభావం?
పురుషులకు కాఫీ తాగడం వల్ల మేలు జరుగుతుందా? కీడు జరుగుతుందా? అనేది తెలియాలంటే అధ్యయనాలు ఏం చెబుతున్నాయో చదవాలి. వీర్యకణాల సంఖ్య, నాణ్యతపై కెఫీన్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో కొన్ని పరిశోధనలు చెప్పాయి. అధ్యయనాలను బట్టి మితంగా కెఫీన్ తీసుకోవడం వల్ల మగవారి సంతానోత్పత్తి పెరుగుతుంది. రోజుకో కప్పు కాఫీ తాగే మగవారిలో స్పెర్మ్ నాణ్యత, సంఖ్య, చలన శీలత బావున్నట్టు గుర్తించారు. పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న వారు రోజుకో చిన్న కప్పు కాఫీ తాగడం మంచిదే. అలాగని అతిగా తాగితే మాత్రం అనర్థం తప్పదు.  


ఇలా తాగితే...
2016 అధ్యయనం ప్రకారం, కెఫిన్ కలిగిన సోడాలు, ఎనర్జీ డ్రింక్స్, కాఫీలు  తీసుకోవడం వల్ల మగవారిలో సంతానోత్పత్తి తగ్గుతుంది. అలాగే కెఫిన్‌తో కూడిన టీ పానీయాలు తీసుకునే ఆడవారికి గర్భం దాల్చే అవకాశం తక్కువగా ఉంటుందని కూడా అధ్యయనంలో తేలింది. కాబట్టి రోజుకు ఒక చిన్నకప్పుకు మించి అధికంగా తాగకూడదు. ముఖ్యంగా పిల్లల్ని కనే ప్లాన్ లో ఉన్నవారు మాత్రం కెఫీన్ అతి తక్కువగా తీసుకోవాలి. 


Also read: యాభై శాతం భారతీయ ఉద్యోగులు ఇందుకే రాజీనామా చేస్తున్నారు, సర్వేలో షాకింగ్ విషయాలు


Also read: ఈ ఎర్రని పండ్ల రసం సహజంగా నిద్రలేమిని అంతం చేస్తుంది, మందులు అవసరమే ఉండదు







గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.