కరోనా వచ్చాక పరిస్థితులు చాలా మారిపోయాయి. ముఖ్యంగా ఉద్యోగాల అంశంలో పెను మార్పులు సంభవించాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ వర్క్ మోడ్‌లు పరిచయం అయ్యాయి. ఇప్పటికీ 80 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగులు బర్న్ అవుట్‌కు గురవుతున్నారు. అంటే ఆఫీసుతో పోలిస్తే ఇంట్లో ఎక్కువ సేపు పనిచేయాల్సి వస్తుంది. ఆఫీసులో టైమ్ టు టైమ్ వెళ్లి ఇంటికి వచ్చేసేవారు. ఇప్పుడు ఇంట్లో ఆ రోజు ఇచ్చిన పని లేదా ఇష్యూ అయ్యే వరకు పనిచేయాల్సి వస్తోంది. దీనివల్ల ఆఫీసులో తొమ్మిది గంటలు పనిచేసే వారు ఇంట్లో 12 నుంచి 15 గంటలు పనిచేయాల్సి వస్తుంది. దీని వల్ల విరక్తి పెరగిపోతోంది. ఈ ఉద్యోగం వదిలి వేరే ఉద్యోగం చేసుకోవాలన్న ఆలోచన వారిలో కలుగుతోంది. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న భారతీయుల్లో బర్న్ అవుట్ కారణంగా ప్రతి ఇద్దరిలో ఒకరు ఉద్యోగ మార్పు కోసం చూస్తున్నారని ఒక తాజాగా నివేదక తెలిపింది. బర్న్‌అవుట్ అనేది ఒక మహమ్మారి అనే చెప్పాలి. ఇది బయటికి కనిపించని ఆరోగ్య సమస్య. మానసికంగా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది.
యాభై శాతం మంది...
యూజర్ టెస్టింగ్ నివేదిక ప్రకారం, మన దేశంలోని 50 శాతం మంది బర్న్‌అవుట్ కారణంగా రాజీనామాలు చేస్తున్నట్టు గుర్తించారు. 20 శాతం మంది ఉద్యోగాన్ని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయలేక మానేయడానికి సిద్ధపడుతున్నట్టు కనుగొన్నారు. ఇంటి నుంచి పనిచేయడం అనేది కాస్త సౌలభ్యాన్ని ఇచ్చింది. అలాగే ఉత్పాదకత, పనిచేసే సామర్థ్యాన్ని కూడా పెంచింది. దీంతో చాలా కంపెనీలు ఆఫీసులకు రమ్మని ఉద్యోగులను పిలవడం లేదు. అయితే ఉద్యోగులకు మాత్రం ఇలా ఎక్కువ సేపు పనిచేయడం చాలా కష్టంగా మారింది. ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తోంది. మీటింగుల పేరుతో చాలా సేపు సమయాన్ని మేనేజర్లు తీసేసుకుంటుంటే, ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయడానికి మరికొంత ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తోంది.
కరోనా తరువాత మన దేశంలోని 55 శాతం మంది ఉద్యోగుల పనిగంటల్లో పెరుగుదల కనిపించింది. సర్వే ప్రకారం, 80 శాతం మంది ఇప్పటికీ హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరిస్తున్నారు. అయితే 10 శాతం మంది కొన్ని రోజులు ఆఫీసు నుండి, కొన్ని రోజులు ఇంటి నుండి పని చేస్తున్నట్లు నివేదిక చెబుతోంది.
Also read: ఈ ఎర్రని పండ్ల రసం సహజంగా నిద్రలేమిని అంతం చేస్తుంది, మందులు అవసరమే ఉండదు
Also read: నెలరోజులు నిల్వ ఉండేలా కోడిగుడ్డు పికిల్, చికెన్ పచ్చడిలాగే చాలా రుచి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.