ED Counter On MlC Kavitha Bail Petition In Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసుకు (Delhi Liquor Case) సంబంధించి మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ సాగింది. ఆమె బెయిల్ పిటిషన్లపై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈడీ తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. మరోవైపు, సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్లపై ఈ నెల 27న కౌంటర్ దాఖలు చేయనున్నట్లు సీబీఐ తెలిపింది. జూన్ 7న ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని వెల్లడించింది. కాగా, ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్ వేశారు. పీఎంఎల్ఏ సెక్షన్ - 19 ప్రకారం కవిత అరెస్ట్ చట్ట విరుద్ధమని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. దీంతో ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ, సీబీఐలకు కోర్టు నోటీసులు జారీ చేసింది.


కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలను న్యాయస్థానం ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈడీ అరెస్ట్ చేసిన విధానం, కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కోర్టుకు కవిత తరఫు న్యాయవాది వివరించారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రంలోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. రెండు కేసుల్లోనూ సోమవారం కవిత తరఫున వాదనలు పూర్తి చేయాలని సూచించింది. ఆ తర్వాత మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 16న ఈడీ అరెస్ట్ చేసింది. అటు, సీబీఐ సైతం ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.


Also Read: Australia: విదేశాల్లో విషాదాలు - ఆస్ట్రేలియాలో షాద్ నగర్ వాసి, అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి