Bangladesh MP Murder Case: కోల్‌కత్తాలో బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనర్ (Anwarul Azim Anar) దారుణ హత్యకు గురవడం సంచలనమైంది. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌కి వచ్చిన ఓ వ్యక్తి ఎంపీని హత్య చేసినట్టు తేలింది. ముంబయిలో ఉంటున్న జిహాద్ హావల్‌దార్ ఈ హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ హత్య తానే చేసినట్టు విచారణలో (Bangladesh MP Murder) అంగీకరించాడు. అయితే...ఈ మర్డర్ జరిగిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఓ అపార్ట్‌మెంట్‌లో చేసి తరవాత తోలంతా ఒలిచి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ ముక్కల్ని ప్లాస్టిక్ కవర్‌లలో పెట్టి సిటీలో పలు చోట్ల వాటిని పారేశాడు. పక్కా ప్లాన్‌తో ఈ హత్య జరిగినట్టు పోలీసులు తేల్చి చెప్పారు. బంగ్లాదేశ్ మూలాలున్న అమెరికాలోని అక్తరుజ్జమాన్‌ ఈ మర్డర్ వెనక మాస్టర్‌ మైండ్‌గా ఉన్నట్టు నిందితుడు అంగీకరించాడు. అక్తరుజ్జమాన్‌ ఆదేశాలు ఇచ్చిన తరవాతే మొత్తం నలుగురు బంగ్లాదేశ్ పౌరులు ప్లాన్ చేసి ఎంపీని దారుణంగా హతమార్చారు. బెంగాల్ CID అధికారులు విచారణను వేగవంతం చేశారు. అపార్ట్‌మెంట్‌లో రక్తపు మరకల్ని గుర్తించినట్టు వెల్లడించారు. పోలీసులు చెప్పిన వివరాల ఆధారంగా చూస్తే ముందు ఎంపీకి ఉరి బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ తరవాత తోలంతా ఒలిచేశారు. శరీరాన్ని కత్తితో ముక్కలు చేశారు. ఎముకల్నీ విరిచేశారు. ేఆ తరవాత వాటికి పసుపు పూశారు. డీకంపోజ్ అయి వాసన రాకుండా ఇలా జాగ్రత్త తీసుకున్నారు. 


మరి కొన్ని వివరాలు..


హనీట్రాప్ కోణంలోనూ ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అక్తరుజ్జమాన్‌ అనే వ్యక్తి ఎంపీ అన్వరుల్‌కి చాలా సన్నిహితుడు అని, అతడిని హత్య చేసేందుకు రూ.5 కోట్లు సుపారీ ఇచ్చాడని ప్రాథమిక విచారణలో తెలిసింది. డెడ్‌బాడీని ఓ ట్రాలీబ్యాగ్‌లో పెట్టారు. ఆ తరవాత ఆ ముక్కల్ని ఒక్కోచోట పడేశారు. కొన్ని ముక్కల్ని ఫ్రిజ్‌లో దాచారు. ఢిల్లీకి వెళ్తున్నందున తనకు ఎవరూ కాల్ చేయొద్దని ఎంపీ ఫోన్ నుంచి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మెసేజ్‌లు పంపారు. ఇలా సంచలన విషయాలెన్నో బయటకు వస్తున్నాయి. ఎక్కడా ఎంపీ ఆచూకీ దొరక్కుండా సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు.