Odisha Puri Jagannath Temple Key: ఒడిశాలో ఎన్నికల వేళ పూరి జగన్నాథుడి గుడికి సంబంధించిన రత్నభాండాగారం తాళాలు మాయం కావడంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. స్వయంగా మోదీ పూరికి వచ్చి దేవుడి తాళాలు పోయినా పట్టించుకోరా? అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీశాయి. ఐతే మోదీ, నవీన్ పట్నాయక్ రాజకీయం కాసేపు పక్కన పెడితే ఇంతకు ఆ పూరి రత్నభాండాగారంలో ఏముంది.? వజ్ర వైఢూర్యాలు ఉంటే మరి ఆ తాళం ఎవరు తీశారు.? తాళం పోయి 40 ఏళ్లు అవుతున్నా ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు.? 


మన దేశంలో ఉత్తరాన బద్రీనాథ్, పశ్చిమాన ద్వారక, దక్షిణాన రామేశ్వరం, తూర్పున పూరి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటన్నింటిని కలిపి చార్ ధామ్ అని పిలుస్తారు. హిందువులు తమ జీవితంలో వీటిని ఒక్కసారైన దర్శించుకోవాలని భావిస్తుంటారు. అలా చార్ ధామ్ లో ఒక ప్రముఖ పుణ్య క్షేత్రమే ఒడిశాలో ఉన్న పూరి. 12వ శతాబ్దంలోనే ఇక్కడ ఆలయ నిర్మాణం (Puri Jagannath Temple History) ప్రారంభమైంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువు తీరి ఉంటాయి. ఇది ఆలయ విశిష్ఠత ఐతే.. జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి అంటే 12వ శతాబ్ధం నుంచి 18వ శతాబ్ధం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు దేవదేవుడికి విలువైన ఆభరణాలు, బంగారం వెండి వజ్ర వైఢూర్యాలు సమర్పించుకుంటూ వచ్చారు. అంతే కాదు..భక్తులు సైతం భారీ స్థాయిలో బంగారాన్ని దేవదేవుడికి కానుకలుగా ఇచ్చారు. ఇలా వచ్చిన విలువైన ఆభరణాలన్నీ శ్రీక్షేత్రంలోని రత్నభండాగారంలోని మూడో గదిలో దాచారు. 


రత్నభాండాగారంలోని మొదటి, రెండో గదిలో దేవుడి అలంకరణకు సంబంధించిన ఆభరణాలు, ఇతర వస్తువులు ఉంటాయి. సో.. ఈ గదిని రెగ్యూలర్‌గా పండుగలప్పుడు తెరుస్తారు. మూడో గదికి మూడు తలుపులు (Puri Jagannath Temple Ratna Bhandagar) ఉంటాయి. ఒక్కో తలుపుకు ఒక్కో తాళం చొప్పున మూడు తాళాలు ఉంటాయి. వీటిలో ఒక తాళంచెవి గజపతి రాజుల వద్ద ఉంటుంది. మరో తాళంచెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది. ఇక మూడో తాళం ఆలయ ప్రధాన అర్చకుడు భాండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది. ఈ మూడు తాళాలు ఉంటే తప్పా ఆ గది తలుపులను తెరవడానికి కుదరదు. గడిచిన వందేళ్లలో ఈ మూడో తలుపును కేవలం 4 సార్లే తెరిచారు. 1905లో,1926లో,1978లో చివరగా 1984లో తెరిచారు. అంటే లాస్ట్ టైమ్ ఓపెన్ చేసి సుమారు 40 ఏళ్లు ఐందనమాట. దీంతో.. ఇంతకు ఆ గదిలో ఏముంది..? తిరువనంతపురం పద్మనాభస్వామి గుడికి మాదిరిగా ఈ గదిలో లక్షల కోట్ల విలువ చేసే సంపద ఉందా..? అన్న అనుమానాలు జనాల్లో మొదలయ్యాయి. దీంతో.. ప్రజాసంఘాలు ఆ గదిని తెరవాలని కోర్టును ఆశ్రయించాయి.


హైకోర్టు ఆదేశాలతో 2018 ఏప్రిల్ 4న రత్నభాండాగారంలోని మూడో గదిని (Puri Jagannath Temple Ratna Bhandagar Mistory) తెరవడానికి 16 మందితో కూడిన టీమ్ ప్రయత్నించింది. కానీ వారు తెరవలేక పోయారు. ఈ తరుణంలో మూడో తాళం ఉంటే తప్ప ఆ గదిని తెరవలేమని అధికారులు చెప్పడంతో ఒడిశా సర్కార్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి రఘువీర్ దాస్ ఆధ్వర్యంలో ఓ కమిషన్ ఏర్పాటు చేసింది. అది 300కుపైగా పేజీలతో ఓ రిపోర్టు ప్రభుత్వానికి అందించింది. అయితే ఇంతవరకు ఆ నివేదికను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఆ నివేదికలో ఏం ఉందన్నది మిస్టరీగా మారింది. 


2018లో ఒడిశా అసెంబ్లీలో రత్న భాండాగారం గురించి చర్చ రాగా.. అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జైనా అసెంబ్లీ సాక్షిగా సమాధానమిచ్చారు. చివరి సారిగా 1978 మే 15 నుంచి 1978 జూలై 23 వరకు అప్పట్లో ఆలయంలోని ఆభరణాలపై ఓ సర్వే చేయించారు. ఆ సర్వే రిపోర్టు ప్రకారం.. 12వేల 381 తులాల కంటే ఎక్కువగా బంగారం.. 22,153 తులాల కంటే ఎక్కువగా వెండి ఆభరణాలు ఉన్నట్లు ఒడిశా సర్కార్ స్పష్టం చేసింది. ఒక తులం అంటే 11.66 గ్రాములు కాబట్టి.. ఈ లెక్కన చేస్తూ 149 కేజీల బంగారం...258 కేజీల వెండి ఉన్నట్లు సర్వే చెప్పిందని చెప్పారు. 


స్థానిక ప్రజలు, పూజాారులు చెబుతున్న దాని ప్రకారం ఆ గదిలో లక్షల కోట్ల సంపద దాగి ఉంది. కానీ, సర్కార్ మాత్రం కేవలం 149 కేజీల బంగారం మాత్రమే ఉందని చెబుతోంది. సర్కార్ చెప్పేదే నిజమైతే.. వాటిని కాపాడటానికి అప్పట్లో రాజులు ఇంత స్థాయిలో రక్షణ వలయం ఎందుకు ఏర్పాటు చేశారు..? మరి వాటి గురించి 2018లో రిటైర్డ్ జడ్జి ఇచ్చిన రిపోర్టును ఎందుకు బహిర్గతం చేయట్లేదు..? లక్షల కోట్ల సంపదను దోచేశారా..? అందుకే ఆ తలుపులు తెరిస్తే అసలు గుట్టు బయటపడుతుందని పాలకులు భావిస్తున్నారా..? ఇలా ఒక్కటేంటీ ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు భక్తులను వెంటాడుతున్నాయి. 


ఎన్నికల వేళ కావాలనే తాళాలు పోయాయంటూ బీజేపీ గుడి రాజకీయాలు చేస్తోందని BJD పార్టీ... BJD పార్టీకి హిందు సంప్రదాయాలపై గౌరవం లేదని బీజేపీ ఆరోపణలు చేసుకుంటున్నాయి. రాజకీయం ఎలా ఉన్నప్పటికీ పూరి జగన్నాథుడి రత్నభాండాగారం మిస్టరీ ఇది. ఏదో రోజు ఆ తాళం చెవి దొరికి లేదా.. ఇతర మార్గాల ద్వారా తలుపులు తెరిస్తే గాని తెలియదు... ఆ జగన్నాథుడి కింద ఎన్ని లక్షల కోట్ల విలువైన సంపద దాగి ఉందో అన్నది..!