Shadnagar Resident Death In Australia: విదేశాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు మృతి చెందడం కలకలం రేపింది. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ఆస్ట్రేలియాలో (Australia) అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. ఏపీకి చెందిన విద్యార్థి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ (Shadnagar) వాసి అరటి అరవింద్ యాదవ్ (30) ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. షాద్‌నగర్‌కు చెందిన బీజేపీ నేత అరటి కృష్ణ ఏకైక కుమారుడు అరవింద్.. ఉద్యోగ రీత్యా సిడ్నీలో స్థిరపడ్డాడు. 5 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత సోమవారం స్వదేశానికి వచ్చేందుకు కుటుంబ సభ్యులతో కలిసి అరవింద్ ఏర్పాట్లు చేసుకున్నారని బంధువులు తెలిపారు. అక్కడి వాతావరణం పడకపోవడంతో వారం రోజుల క్రితం తల్లి ఉషారాణి షాద్‌నగర్ వచ్చింది. సోమవారం స్వగ్రామానికి వచ్చేందుకు అరవింద్ విమాన టికెట్లు బుక్ చేసుకున్నాడు. అతని భార్య గర్భిణి. కారు వాష్ కోసం బయటకు వెళ్లిన అరవింద్ తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారించిన పోలీసులు.. సముద్రంలో ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం ఆ మృతదేహం అరవింద్‌దేనని ధ్రువీకరించారు. ఇది హత్యా..? లేక ఆత్మహత్యా.? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.


అమెరికాలో ఏపీ విద్యార్థి


అటు, ఏపీకి చెందిన తెలుగు విద్యార్థి అక్కడి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఏపీకి చెందిన బెలెం అచ్యుత్ అనే యువకుడు న్యూయార్క్‌ నగరంలోని న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీలో విద్య అభ్యసిస్తున్నాడు. బుధవారం సాయంత్రం బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. 'న్యూయార్క్ స్టేట్ వర్శిటీకి చెందిన విద్యార్థి అచ్యుత్ బైక్ ప్రమాదంలో బుధవారం మధ్యాహ్నం మృతి చెందడం విచారకరం. అతని అకాల మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాం. మృతుడి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. బాధిత కుటుంబం, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని త్వరలో భారత్ కు పంపించేందుకు బాధిత కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం.' అని ట్వీట్ చేసింది.






Also Read: Hyderabad News: ఘోర ప్రమాదం - ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని ముగ్గురు మృతి, ఎక్కడంటే?