Palnadu News: పల్నాడు రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. రిగ్గింగులు, ఈవీఎం ధ్వంసం అంశాలు హాట్ టాపిక్‌గ్గా మారాయి. మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేటు 202 పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఈవీఎం (EVM ) ధ్వంసం చేశారు. తర్వాత అక్కడున్న వారిని బెదిరించి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది. అప్పటి నుంచి పిన్నెల్లి పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. 


లోకేష్‌కు ఆ వీడియోలు ఎలా వచ్చాయి?
ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోలను టీడీపీ నాయకుడు నారా లోకేశ్ పోస్ట్ చేశారని.. ఆ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారని పిన్నెల్లి లాయర్ వాదించారు. నోటీసులు ఇవ్వకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడానికి వెళ్లడం సరికాదని అన్నారు. లోకేష్‌కు ఆ వీడియోలు ఎలా వచ్చాయో తేల్చాలన్నారు. పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఈసీ నేరుగా ఆదేశాలు ఇవ్వడం సరైనది కాదని వాదించారు. వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం పిన్నెల్లిని రామక్రిష్ణా రెడ్డిపై జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఈసీని ఆదేశించింది. అయితే, సాక్షులను ప్రభావితం చేయొద్దంటూ అభ్యర్థులకు షరతు విధించింది. ఎన్నికల లెక్కింపు ముగిసిన తర్వాత రోజు ఉదయం 10 గంటల వరకూ అభ్యర్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్నికల సంఘాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు  ఆదేశించింది.


అజ్ఞాతం వీడి బయటకొస్తారా?
హైకోర్టు నుంచి ఉపశమనం లభించిన నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి సోదరులు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన అభిమానులు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజులుగా పిన్నెల్లి సొంత పనుల మీద హైదరాబాద్‌లో ఉన్నారని, కోర్టు ఉత్తర్వులతో నియోజకవర్గానికి వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. 


అరెస్ట్ హైడ్రామా?
ఈవీఎంల ధ్వంసం కేసు, కారంపూడి అల్లర్ల నేపథ్యంలో పిన్నెల్లి సోదరుల అరెస్టులు తప్పదనే ప్రచారం సాగింది. దీంతో రాత్రికి రాత్రి పెన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన ఆచూకీ గుర్తించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా గాలించారు. ఫోన్ ఆధారంగా హైదరాబాద్‌ సమీపంలోని సంగారెడ్డిలో ఉన్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే సంగారెడ్డి ఎస్పీ అరెస్ట్ వార్తలు అవాస్తవమని ఖండించారు. పటాన్‌చెరు సమీపంలోని గణేష్ తండా వద్ద డ్రైవర్, గన్‌మ్యాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దీంతో పిన్నెల్లి సోదరులు అరెస్ట్ భయంతో పారిపోయారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే పిన్నెల్లి సొంత పనుల మీద బయటకు వెళ్లారని, భయపడి పారిపోవాల్సిన అవసరం లేదని వైసీపీ వర్గాలు బదులిచ్చాయి. అలాగే పిన్నెల్లి సైతం పలు టీవీ ఛానెల్లలో కనిపిస్తూ తానెక్కడికి పారిపోలేదని చెప్పారు.  


పోలింగ్ సిబ్బందిపై వేటు
ఈవీఎంల ధ్వంసం ఘటనకు సంబంధించి ఎన్నికల సంఘం సిబ్బందిపై చర్యలు చేపట్టింది. పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సహా ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ బూత్‌లో అడుగుపెట్టగా.. అక్కడ ఉన్న పీఓ, ఇతర సిబ్బంది లేచి నిలబడి ఆయనకు అభివాదం చేశారు. దాంతోపాటు ఈవీఎం నేలకేసి పగలగొడుతుంటే పోలింగ్ సిబ్బంది అలానే చూస్తుండిపోయారు. ఈ అభియోగాలతో వీరిపై వేటు వేసిన ఈసీ గురువారం లోపు సంజాయిషీ ఇవ్వాల్సిందిగా తమ ఆదేశాలలో పేర్కొంది. ఈవీఎం ధ్వంసం ఘటనపై ప్రిసైడింగ్ ఆఫీసర్ గాన్న అధికారి సరైన సమాధానం ఇవ్వలేదని ఎన్నికల సంఘం పేర్కొంది.