Relief To Accused In Election Cases In Ap Highcourt: ఈ నెల 13న ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలు, అల్లర్ల కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు ఏపీ హైకోర్టులో (AP HighCourt) తాత్కాలికంగా ఊరట లభించింది. జూన్ 6 వరకూ వారిని అరెస్ట్ చెయ్యొద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఆదేశాలతో మాచర్ల (Macharla) పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉపశమనం లభించినట్లయింది. అటు, తాడిపత్రి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, నరసరావుపేట వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డిలకు సైతం అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా, బరిలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉన్నందున అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలన్న పిటిషనర్ల తరఫున లాయర్ల వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. 


ఇవీ షరతులు


అయితే, వీరికి కొన్ని షరతులు విధించిన న్యాయస్థానం.. వీరి కదలికలపై ఎన్నికల సంఘం పోలీసులతో నిఘా, పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. అభ్యర్థుల వెంట నలుగురికి మించి ఉండరాదని స్పష్టం చేసిన ధర్మాసనం.. సాక్షులను బెదిరించకూడదని, దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తెలిపింది. కేసు లోతుల్లోకి వెళ్లకుండా ఈ మేరకు తాత్కాలిక ఉత్తర్వులు ఇస్తున్నట్లు పేర్కొంది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసిన కోర్టు.. ప్రధాన వ్యాజ్యాల్లో పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని వెల్లడించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకూ తాడిపత్రి నియోజకవర్గంలో అడుగుపెట్టొద్దని అక్కడి టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షరతు విధించారు.


ఇదీ జరిగింది


కాగా, ఈ నెల 13న పోలింగ్ రోజు, అనంతరం తాడిపత్రి, మాచర్ల, తిరుపతిలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. మాచర్ల పాల్వాయిగేట్ సమీపంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటకు రావడం సంచలనం కలిగించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న పిన్నెల్లి గురువారం (మే 23) హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయనతో పాటు జేసీ అస్మిత్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సైతం పిటిషన్లు వేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారని ఆయన తరఫు లాయర్ వాదించారు. అసలు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి వెళ్లడం సరికాదన్నారు. పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఈసీ నేరుగా ఆదేశాలు ఇవ్వడం కూడా కరెక్టు కాదని వాదించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల కౌంటింగ్ ముగిసిన మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ అభ్యర్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఈసీని ఆదేశించింది. అటు, ఇతర అభ్యర్థుల పిటిషన్లపైనా విచారించి వారికి అరెస్ట్ నుంచి హైకోర్టు రక్షణ కల్పించింది.


Also Read: Chandra Babu News: టీడీపీ బాధ్యతలు లోకేష్‌కు అప్పగించాలి- చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన రోజే జరగాలి: బుద్దా వెంకన్న