Buddha Venkanna News: తెలుగు దేశంలో పార్టీ బాధ్యతలను నారా లోకేష్‌కు అప్పగించాలని ఆ పార్టీ లీడర్ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. దీని ఎక్కువ టైం తీసుకోవద్దని సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన రోజునే జరిగిపోవాలని అన్నారు. మూడు వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి పార్టీ పటిష్టానికి శ్రమించిన లోకేష్ కంటే అర్హుడు ఎవరని ప్రశ్నించారు. తాను చెబుతున్నది రిక్వస్ట్ కాదని డిమాండ్ అని అన్నారు. 


విజయవాడలో ప్రెస్‌మీట్‌ పెట్టిన టీడీపీ లీడర్ బుద్ద వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర అన్ని వర్గాల మద్దతు లోకేష్‌కు ఉందని... చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పార్టీని సమర్థంగా నడిపారన్నారు బుద్ద. ఈ ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీతో కూటమి అధికారం చేపడుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అందులో సందేహం లేదన్నారు బుద్ద వెంకన్న.


కూటమి అధికారంలోకి వస్తే కచ్చితంగా లోకేష్‌కు మంత్రి పదవి వస్తుందని అంతకంటే ముందు ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేశారు బుద్ద వెంకన్న. ఇన్ని రోజులు పార్టీకి సేవలు అందించిన ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నకి వేరే విధంగా న్యాయం చేయాలని అన్నారు. ఈ మార్పు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేపట్టాలని అన్నారు. 


కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న బుద్ద వెంకన్న... అమరావతిలోనే చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేస్తారు అన్నారు. చంద్రబాబు ఒక్కరే ఇప్పటి వరకు ఒంటి చేత్తో పార్టీని లాక్కొస్తున్నారని ఇప్పుడు లోకేష్, బ్రహ్మణి, భువనేశ్వరి తోడయ్యారన్నారు. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుంది అంటే అందులో వీరి అందరి పాత్ర ఉందని అభిప్రాయపడ్డారు. 130 స్థానాలకుపైగా కూటమి గెలుస్తుందని అంచనా వేశారు. 


చంద్రబాబు నాయుడు ఆత్మకథ రాసుకుంటే అందులో తనకూ ఓ పేజీ కచ్చితంగా ఉండుదన్నారు బుద్ద వెంకన్న. 2019 నుంతి పార్టీ కోసం చాలా కష్టపడ్డానన్నారు. రాజకీయ నాయకుడి పాదాలకు రక్తంతో అభిషేకం చేసిన చరిత్ర ఎవరికీ లేదని తాను పని చేశాను అన్నారు. అందుకే లోకేష్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. చంద్రబాబు దగ్గర తనకు మాట్లాడే చనువు ఉందన్న బుద్దా... లోకేష్‌కు పదవీ బాధ్యతలు అప్పగిస్తే మరో 30 ఏళ్లు పార్టీ భవిష్యత్‌కు డోకా ఉండదన్నారు.