తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక దళిత బంధు పథకాన్ని మరో నాలుగు మండలాలలో వర్తింపచేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే వాసాలమర్రిలో మొదటగా దళితబంధు పథకాన్ని అమలు చేశారు. ఆపై అధికారికంగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకుని దళిత బంధును అమలు చేస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకేశారు.
తెలంగాణలో నలువైపులా దళిత బంధు అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఎస్సీ నియోజకవర్గాలలో ఒక్కో మండలంలో దళిత బంధు అమలు కానుంది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాం సాగర్ మండలాలలో అన్ని దళిత కుటుంబాలకు దళితబంధు వర్తింపజేయనున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ నేటి నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారని తెలిసిందే.
Also Read: వాసాలమర్రి దళితుల అకౌంట్లలోకి రూ. 10 లక్షలు.. కేసీఆర్ సంచలన ప్రకటన..!
టీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఈ ఏడాది ఏప్రిల్‌లో 20 ఏళ్లు పూర్తయ్యాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి ఢిల్లీలో స్థలాన్ని కేటాయించింది. సీఎం కేసీఆర్ రేపు టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనూ తమ ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న విమర్శలకు చెక్ పెట్టాలని సీఎం కేసీఆర్ భావించారు. దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రజలలో నమ్మకాన్ని కలిగించేందుకు తెలంగాణలో నాలుగు దిక్కులలో ఉన్న ఎస్సీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో ఓ మండలాన్ని దళిత బంధు అమలుకు ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం పథకం అమలు తీరుపై ఆయా జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో సమావేశం కానున్నారు.
Also Read: Dalitha Bandhu: దళిత బంధు విషయంలో అదే జరిగితే యాదాద్రిలో ఆత్మహత్య చేసుకుంటా: మోత్కుపల్లి
కాగా, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ మంత్రులు, ఇతర కీలక నేతలు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు తమ ప్రభుత్వంపై భరోసా కలిగించడంలో భాగంగా దళిత బంధు పథకాన్ని మరో నాలుగు మండలాల్లో అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హుజూరాబాద్ ఎన్నికలు రాగానే దళితులు గుర్తొచ్చారా అని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శిస్తున్నా.. తెలంగాణ సీఎం కేసీఆర్ తనదైన పంథాలో ముందుకు సాగుతున్నారు. అయితే ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో దళితబంధును ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. విడతల వారీగా ఒక్కో ప్రాంతంలో పథకాన్ని అమలు చేసి దళితుల కుటుంబాలకు రూ.10 లక్షలు అందిస్తామని సీఎం కేసీఆర్ పలుమార్లు స్పష్టం చేశారు.
Also Read: Dalitha Bandhu News: దళిత బంధుపై వేగం పెంచిన సర్కార్.. మరో రూ.500 కోట్లు విడుదల