తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం అమలును ప్రారంభించేశారు. అధికారికంగా హూజూరాబాద్ నియోజవర్గంలో ఆగస్టు పదహారో తేదీన ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కానీ.. ముందుగా తన దత్తత గ్రామం వాసాల మర్రి దళితులకు పథకం వర్తింప చేయాలని నిర్ణయించారు. వాసాల మర్రి గ్రామంలోని ఎస్సీకాలనీలో  పర్యటించిన ఆయన .. దళితులతో సమావేశం అయ్యారు.  దళిత బంధు పథకంపై మాట్లాడారు. వాసాల మర్రిలో 76 దళిత కుటుంబాలు...  పథకానికి అర్హత సాధించాయని ఆ కుటుంబాలన్నింటికీ.. రేపే అకౌంట్లలో డబ్బులు చేస్తామని ప్రకటించారు.  ఒక్కో కుటుంబానికి రూ. పది లక్షల చొప్పున.. 76 కుటుంబానికి రూ. ఏడు కోట్ల అరవై లక్షలు అకౌంట్లలో జమ చేస్తారు. అయితే..   రూ. పది లక్షల్లో రూ. పదివేలు మినహాయించుకుని .. దానికి ఇంకో రూ. పదివేలు జోడించి.. .దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ నిధి పూర్తిగా దళితులకేనని స్పష్టం చేశారు. ఎవరికైనా ఆపద వస్తే దళిత రక్షణ నిధులు ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేశారు. 


దళిత బంధు నిధులు దుర్వినియోగం చేయవద్దని కేసీఆర్ దళితులకు సలహా ఇచ్చారు. అభివృద్ధి చెందడానికి దళిత బంధు రూపంలో గొప్ప అవకాశం వచ్చిందని కేసీఆర్ తెలిపారు. దీన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. దళిత బంధు ఇచ్చినా మిగిలిన అన్ని పథకాలు కొనసాగిస్తామని ఇళ్లు కూడా కట్టిస్తామని కేసీఆర్ ప్రకటించారు.  దళిత బంధు పథకాన్ని మొదట నియోజకవర్గానికి వంద మందికి మాత్రమే వర్తింప చేయాలనుకున్న సీఎం కేసీఆర్... ఆ తర్వాత.. అర్హత ఉన్న అన్ని కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఉపఎన్నిక జరగనున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఐదు వందల కుటుంబాలను ఎంపిక చేసి.. వారికి ఆగస్టు పదహారో తేదీన పంపిణీ చేయాలని నిర్ణయించారు.. అప్పుడే పథకం అధికారికంగా ప్రారంభమవుతుంది. అయితే కేసీఆర్ ముందుగానే లాంఛనంగా వాసాలమర్రిలో పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని తాను గత ఏడాదే ప్రారంభించాలని అనుకున్నానని కానీ.. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని కేసీఆర్ చెప్పారు.  


దళిత బంధు పథకం విషయంలో కేసీఆర్ చాలా దూకుడుగా ఉన్నారు. పథకం ప్రకటించినప్పటి నుండి ఆయన ప్రతీ రోజూ..  ఏదో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. రూ. లక్ష కోట్లు అయినా సరే పథకం కోసం వెచ్చిస్తామని చెబుతున్నారు. విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నారు. ఈ పథకాన్ని ఉపఎన్నికల్లోపే అమలు చేయాలని వస్తున్న డిమాండ్లకు... వాసాల మర్రి నుంచే సమాధానం ఇస్తున్నారు.