దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ.500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ.2 వేల కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన రూ.500 కోట్లతో పాటు తాజాగా విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.వెయ్యి కోట్ల నిధులు విడుదలయ్యాయి. కాగా, వారం రోజుల్లోపు మరో రూ.వెయ్యి కోట్లను ప్రభుత్వం విడుదల చేయనున్నది. దాంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.2 వేల కోట్ల నిధులు పూర్తి స్థాయిలో విడుదల అవుతాయి.


Also Read: Huzurabad: ఈటల రాజేందర్‌కు గట్టి షాక్.. హుజూరాబాద్‌లో మరో కీలక పరిణామం


పట్టుదలతో ముందుకెళ్తున్న కేసీఆర్!
హుజూరాబాద్‌లో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్‌ను ఓడించడమే లక్ష్యంగా ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. దుబ్బాక తరహాలో హుజూరాబాద్‌ను అంత తేలిగ్గా తీసుకోకుండా ముందు నుంచే గెలుపు వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దళిత బంధు వంటి భారీ పథకాన్ని ప్రకటించారు. ఆ వెంటనే విపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి. ఇది ఎన్నికల కోసం చేస్తున్న ఎత్తుగడ అని, హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ఇక దళిత బంధు అటకెక్కుతుందని విపరీతమైన విమర్శలు వచ్చాయి. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ సహా విపక్ష నేతలు, తీన్మార్ మల్లన్న వంటి వారు కూడా దళిత బంధు మూణ్నాళ్ల ముచ్చటే అవుతుందని పదే పదే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.


దళిత బంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు చూస్తుంటే ఈ విమర్శలకు దీటైన సమాధానమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆగస్టు 16న దళిత బంధు అధికారికంగా హుజూరాబాద్ నియోజకవర్గం శాలపల్లిలో మొదలైనప్పటికీ అంతకు కొద్ది రోజుల ముందే కేసీఆర్ అనూహ్యంగా దాన్ని తన దత్తత గ్రామం వాసాలమర్రిలో అమలు చేసేశారు. ఆ ఊరిలో ఉన్న 70కి పైగా దళిత కుటుంబాలకు రూ.7 కోట్లకు పైగా దళిత బంధు నిధులను ఆయన పర్యటన మరుసటి రోజే విడుదల చేసేశారు. మళ్లీ శాలపల్లిలో జరిగిన సభలో 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు. రెండు నెలల్లో హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం చెక్కులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగైదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున దళిత బంధు సాయం అందిస్తామని అందుకు రూ.1.70 లక్షల కోట్లు మాత్రమే ఖర్చవుతాయని చెప్పేశారు.


Also Read: Sangareddy: రాఖీ కట్టించుకోనని మొండికేసిన అన్న.. చెల్లెలు అఘాయిత్యం, కాలనీలో షాకింగ్ ఘటన


సీఎం చెప్పినట్లుగానే నిధులు విడుదల
ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లుగా తొలుత హుజూరాబాద్‌లో దళిత బంధు అమలు కోసం వరుసగా నిధులను విడుదల చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రూ.500 కోట్ల నిధులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రూ.2 వేల కోట్ల నిధులు విడుదల చేయాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకు.. ఇప్పటిదాకా రూ.వెయ్యి కోట్లను విడుదల చేశారు. మరో వారంలోపు రూ.వెయ్యి కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది.


Also Read: Hyderabad Fraud: యూపీఐ పిన్ నెంబరు ఇలా పెట్టుకుంటున్నారా? జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది!