బ్యాంకు ఏటీఎం కార్డులకు, యూపీఐ యాప్‌లకు పిన్ నెంబరు సెట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త! మనకు గుర్తు ఉండేందుకు సులువుగా ఉంటుందని నాలుగు అంకెల పిన్ నెంబరును కూడా ఫ్యాన్సీ నెంబర్లుగా పెట్టుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. ఎందుకంటే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన పిన్ నెంబరు సెట్ చేసుకొనే విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో సూచిస్తోంది. హైదరాబాద్‌లో ఓ ఆటో డ్రైవర్ ఏకంగా రూ.లక్షకు పైగా సొమ్మును పోగొట్టుకోవాల్సి వచ్చింది. అదంతా తాను ఏడాదిగా చిట్టీ కట్టుకున్న సొమ్ము కావడం గమనించదగ్గ విషయం. దీంతో బాధితుడు తన తప్పును తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి వివరాలివీ..
కూకట్‌పల్లి ఏవీబీ పురంలో రాము అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను ట్రాలీ నడుపుతూ దానిపై వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 13న సరకును మార్కెట్‌కు తీసుకువెళ్లినప్పుడు అతని ఫోన్ చోరీకి గురైంది. దీంతో వెంటనే కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒకసారి అనుమానం వచ్చి తన ఖాతాను చెక్ చేసుకోగా కంగుతిన్నాడు. ఆయన ఖాతాలో రూ.1.33 లక్షలు మాయం కావడంతో ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. తాను ఆ డబ్బును ఆటోపై ఉన్న అప్పు తీర్చేందుకు నెల నెలా చిట్టీలు కట్టుకుంటూ వచ్చానని వివరించాడు. అలా చిట్టీ పాడగా వచ్చిన డబ్బును తన స్టేట్ బ్యాంకు ఖాతాలో వేయగా ఆ సొమ్మంతా ఖాళీ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
తన ఫోన్‌లో పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకున్నానని.. వాటిని బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేశానని పోలీసులకు వివరించాడు. అన్ని యూపీఐ యాప్‌లకి ఒకే పిన్ ఉంటుంది కాబట్టి.. సులభంగా గుర్తుండేలా పిన్ నెంబరును 1234 అని పెట్టుకున్నానని చెప్పాడు. అయితే, ఫోన్ పోయిన వెంటనే అది దొరికిన నిందితుడు యూపీఐ యాప్‌లో 1234 పిన్ నొక్కి ఉంటాడని, దీంతో డబ్బులన్నీ అతని ఖాతాలోకి వెళ్లిపోయినట్లుగా బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అయితే, బ్యాంకు స్టేట్ మెంట్ వివరాలు చూడగా.. జ్యుయలరీ షాపులో బంగారం, డీ మార్ట్‌లో షాపింగ్ కూడా చేశాడని వివరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు డీ మార్ట్, జ్యుయలరీ షాపుల్లో సీసీటీవీ వీడియో ఫుటేజీ కోసం పరిశీలించారు. వాటిని పరిశీలించి నిందితుడి కోసం వెతుకుతున్నారు. యూపీఐ పిన్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, కఠినమైన పిన్ నెంబర్లను, ఫోన్లకు పాస్ వర్డ్‌లను వాడాలని పోలీసులు సూచించారు.