మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌కు హుజూరాబాద్ నియోజకవర్గంలో గట్టి షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు, కరీంనగర్ కేడీసీసీ బ్యాంకు (క్రిష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) వైస్ చైర్మన్ పింగిళి రమేష్ బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీ భావజాలంతో తాను ఇమడలేకపోతున్నానని అందుకే పార్టీని వీడుతున్నట్లుగా పింగళి రమేష్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా ఆయన వెల్లడించారు.
మరోవైపు, ఈటల రాజేందర్ మాత్రం తన ప్రచార జోరును ఆపడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం కొత్త పథకాలు తెచ్చి జనాన్ని తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నించినా టీఆర్ఎస్‌పై విమర్శలను అలాగే కొనసాగిస్తున్నారు. ప్రశ్నించే గొంతును మూగబోనివ్వకుండా కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందని, తన రాజీనామా వల్లే నియోజకవర్గంలో రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఈటల రాజేందర్ చెబుతూ వెళ్తున్నారు. శనివారం కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల, సిరిసేడు, మర్రివానిపల్లి, బూజునూర్ గ్రామాల్లో ఈటల రాజేందర్ పర్యటించారు. రచ్చబండ తరహాలో ప్రజల మధ్య కూర్చొని వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు తమ బాధలను, కష్టాలను ఈటలతో చెప్పుకున్నారు. అనంతరం పలువురు ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.
Also Read: Karimnagar: ఒకే కాన్పులో అక్కకు నలుగురు, చెల్లికి ముగ్గురు.. మరో అవాక్కయ్యే ట్విస్ట్ కూడా..
మరోవైపు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఈటల రాజేందర్‌కు మద్దతుగా నిలిచారు. రెండ్రోజుల క్రితం జన ఆశీర్వాద యాత్రలో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పర్యటించిన సందర్భంగా కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదని ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి వాళ్లు సైతం ఓడిపోయారని గుర్తు చేశారు. ఎన్ని డబ్బులు పెట్టినా శాశ్వతం కాదని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు మార్పు కావాలని కోరుకుంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఎన్నికల్లో గెలవలేరని విమర్శలు గుప్పించారు. చాలామంది ఈటల రాజేందర్ రాజీనామా వల్లే ఈ పథకాలు వచ్చాయని అనుకుంటున్నారని కిషన్ రెడ్డి అన్నారు.
ఈటల రాజేందర్ ఒంటరి కాదని ఆయన వెనుక సైన్యం ఉందని అన్నారు. లక్షలాది మంది ప్రజలు ఉన్నారని వ్యాఖ్యానించారు. నాన్నని అడ్డుపెట్టుకుని, మామని అడ్డుపెట్టుకొని రాజకీయాల్లోకి రాలేదని కిషన్ రెడ్డి విమర్శించారు.
Also Read: Raksha Bandhan: ఆవు పేడతో అద్భుత రాఖీలు.. అబ్బో! వీటిని ట్రై చేస్తే నిజంగా ఎన్ని ఉపయోగాలో..