పంట పండించడం నుంచి నిత్యం వాడుకునే వస్తువుల వరకూ నేడు ఎక్కువ మంది ప్రజలు పర్యావరణ హితం గురించి ఆలోచిస్తున్నారు. సాగు విధానంలో రసాయనాలు దూరం పెట్టడం, వంటలో మట్టి పాత్రలు వాడుతుండడం వంటి ఎన్నో మార్పులు ఈ కాలంలో చోటు చేసుకుంటున్నాయి. మందులు వాడని ఆహార పదార్థాలకు జనం ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాక, ప్లాస్టిక్, నాన్ స్టిక్ సహా ఇతర నష్టం కలిగించే పదార్థాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి విషయంలోనూ పర్యావరణ హిత పదార్థాలకు ప్రాముఖ్యం పెరుగుతోంది. ఈ క్రమంలో రాఖీల విషయంలోనూ పర్యావరణ హితానికి ఓ మహిళ నడుం బిగించారు.
సాధారణంగా రాఖీలను రంగురంగుల పేపర్లతో ప్లాస్టిక్ పూసలతో తయారు చేస్తుంటారు. దీంతో ఆ రాఖీలకు వాడి పారేశాక పర్యావరణానికి వాటివల్ల నష్టం ఉండేమాట వాస్తవమే. ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా లెక్చరర్‌గా పనిచేసే ఓ మహిళ, ఆవు పేడ, సహజసిద్ధమైన పూలతో అందమైన రాఖీలు తయారు చేస్తున్నారు. వాటిని హైదరాబాద్‌ల్లో అమ్మకాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లికి చెందిన డాక్టర్ చెన్నమనేని పద్మ పర్యావరణహిత రాఖీలను తయారు చేస్తున్నారు.
చెన్నమనేని హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె మూలం వ్యవసాయం. బోర్నపల్లిలో 200 దేశీయ ఆవులతో మురిళీధర గోదామం పేరుతో ఆమె గోశాల ఏర్పాటు చేశారు. వారాంతాల్లో ఆవు మూత్రం, పేడతో రకరకాల ప్రయోగాలు చేయడం ఆమె అలవాటు చేసుకున్నారు. దీపావళికి ప్రమిదలు, వరలక్ష్మీ పూజకు అవసరమైన సామగ్రి తదితర వస్తువులను ఆవు పేడతో తయారు చేసి పలువురి ప్రశంసలు పొందారు.
ఆవు పేడతో రాఖీలు ఇలా..
ఆవులు వేసిన పేడను నెల రోజుల వరకూ ఎండలో ఎండనిస్తారు. అవి పిడకల్లాగా తయారయ్యాక దాన్ని గ్రైండర్ లేదా ప్రత్యేక యంత్రంలో వేసి గోధుమ పిండిలా అయ్యేవరకూ మర ఆడిస్తారు. అలా తయారైన మెత్తటి పేడకు సోయా బీన్స్‌తో తయారైన గోరు గమ్ పౌడర్ అనే పదార్థం, చెరువు మట్టిని కలిపి చపాతీ పిండిలాగా చేస్తారు. ఈ మిశ్రమంతోనే రకరకాల డిజైన్‌లతో అచ్చులు వేసి నీడలో ఆరబెట్టి, దారాన్ని అతికిస్తారు. అవి ఎండాక, వివిధ రంగుల పూలను మర ఆడించి తయారు చేసిన రంగుల ద్వారా పూత పూస్తారు.
ఇలాంటి రాఖీల పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదు. పైగా మొక్కలకు ఈ రాఖీలు ఎరువుగా ఉపయోగపడతాయి. ఇంట్లో ఉండేవారు కుండీల్లో మొక్కలకు ఆ రాఖీలను వేయొచ్చు. దీంతో వీటికి నగరాలు, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగింది.