తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. వారిలో ఇద్దరు మగపిల్లలు మరో ఇద్దరు ఆడపిల్లలు కావడం విశేషం. ప్రసవం తర్వాత ఆ నలుగురు శిశువులు ఆరోగ్యంగానే ఉన్నట్టు ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. అయితే, వీరి కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. అది తెలుసుకున్న డాక్టర్లు నోరెళ్లబెడుతున్నారు. వారి ఫ్యామిలీలో చాలా మంది కవలలు జన్మించారు. ఆఖరికి ఆ జన్మనిచ్చిన మహిళ కూడా కవల కావడం మరో ఆసక్తికర అంశం. పూర్తి వివరాలివీ..


కరీంనగర్ నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ మహిళ ఒకేసారి నలుగురు పిల్లలకు జన్మ ఇవ్వడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. ఈ మహిళ సోదరి కూడా కొద్ది నెలల క్రితం ఒకేసారి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఇలా పిల్లలకు జన్మనిచ్చిన అక్కాచెల్లెళ్లు కూడా కవలలు. దీంతో ఈ వార్త ఇప్పుడు మరింతగా వైరల్ అవుతోంది. ఒకే కాన్పులో కవలలు పుట్టడమే చాలా అరుదు. కానీ ఇలా నలుగురు పిల్లలు పుట్టడం అత్యంత అరుదైన విషయం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగుల మల్యాలకు చెందిన సాయి కిరణ్, నిఖిత దంపతులకు శనివారం ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు.


Also Read: Hyderabad: సెల్ఫీ తీసుకుంటూ లైవ్‌లో ఉరేసుకున్న వ్యక్తి.. కారణం తెలిసి పోలీసులు షాక్! 
సాయి కిరణ్ భార్య నిఖితకు శనివారం పురిటి నొప్పులు రావడంతో కరీంనగర్‌ నగరంలో యశోద కృష్ణ ఆస్పత్రికి ఆమె కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడి డాక్టర్లు ఆమెను పరిశీలించి ఆమె గర్భంలో నలుగురు పిల్లలు ఉన్నట్లుగా గుర్తించారు. సుఖ ప్రసవం అయ్యే అవకాశం లేదని గుర్తించిన డాక్టర్లు.. సుమారు 12 గంటల పాటు ఆపరేషన్ చేసి నలుగురు పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం డాక్టర్లు మాట్లాడుతూ.. 7 లేదా 8 లక్షల మందికి జరిగే ప్రసవాల్లో ఈ తరహా ప్రసవాలు జరుగుతుంటాయని తెలిపారు. మహిళ అక్కాచెల్లెళ్లు కూడా కవలలే అని తెలుసుకున్న తాము ముందే తగిన జాగ్రత్తలు తీసుకుని సిజేరియన్ చేశామని డాక్టర్ యశోద వెల్లడించారు. తల్లీబిడ్డలు సురక్షితంగా ఉన్నారని వివరించారు. శిశువులు తక్కువ బరువు ఉండడంతో వారిని ఇంక్యుబేటర్‌లో ఉంచుతున్నట్లు వెల్లడించారు.


Also Read: Viral Video: ఛీ.. పాడు.. పానీపూరీలో ఏం కలిపాడో చూడండి.. అసహ్యించుకుంటారు!


Also Read: Raksha Bandhan: ఆవు పేడతో అద్భుత రాఖీలు.. అబ్బో! వీటిని ట్రై చేస్తే నిజంగా ఎన్ని ఉపయోగాలో..