‘జబర్దస్త్’ కామెడీ షోతో పరిచయమై.. ‘బిగ్‌ బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు ‘కామెడీ స్టార్స్’ ద్వారా ఆకట్టుకుంటున్న ముక్కు అవినాష్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ‘‘పెళ్లి ఎప్పుడు..’’ అంటూ ఎప్పుడూ ప్రశ్నల వర్షం కురిపించే అభిమానులకు సమాధానం ఇస్తూ.. అవినాష్ మంగళవారం రాత్రి తన ఎంగేజ్మెంట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు.  


‘‘సరైన వ్యక్తి జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఆలస్యం చేయక్కర్లేదు. మా కుటుంబాలు కలిశాయి. మేము కూడా కలిశాం. ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. మీరు నన్ను చాలాసార్లు ‘పెళ్లి ఎప్పుడు’ అని అడిగారు. అతి త్వరలో నా అనుజాతో. ఎప్పటిలాగానే మీ ఆశీర్వాదాలు ఉంటాయని కోరుకుంటూ.. మీ ముక్కు అవినాష్. సారీ.. మీ అనుజ అవినాష్’’ అని పేర్కొన్నాడు. మొత్తానికి అవినాష్ పెళ్లి కబురు చెప్పడంతో అరియానాతో లవ్ ట్రాక్‌పై అభిమానులకు స్పష్టత వచ్చేసింది. 



అవినాష్‌ను పెళ్లాడుతున్న అమ్మాయి పూర్తి పేరు అనూజ వాకిటి అని తెలిసింది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లని సమాచారం. అయితే, పెళ్లి ఎప్పుడు అనేది అవినాష్ ఇంకా వెల్లడించలేదు. అవినాష్ ప్రస్తుతం మా టీవీలో ప్రసారమవుతున్న ‘కామెడీ స్టార్స్’ షో ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్ 4లో అవకాశం లభించడంతో అవినాష్ ‘జబర్దస్త్’ షోను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ రీ-ఎంట్రీకి అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రముఖ యాంకర్, నిర్మాత ఓంకార్.. ‘కామెడీ స్టార్స్’లో అవినాష్‌కు అవకాశం కల్పించారు. 


‘బిగ్‌ బాస్’ హౌస్‌లో అవినాష్‌కు అరియానాతో స్నేహం కుదిరింది. అయితే, వారిది కేవలం స్నేహమా? ప్రేమా అనేది క్లారిటీ ఇవ్వలేదు. కామెడీ స్టార్స్‌తో కూడా ఆమెతో జంటగా కనిపిస్తూ.. ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. కొన్ని స్పర్థల వల్ల మధ్యలో కొన్ని రోజులు అవినాష్.. అరియానాకు దూరంగా ఉన్నాడు. ఇటీవలే మళ్లీ ఆమెకు తన స్కిట్‌లో రీ-ఎంట్రీ ఇచ్చి.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూను ట్రోల్ చేశాడు. ఈ సందర్భంగా అవినాష్.. తనకు అరియానాకు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని, ఇంకేమీ లేదని స్పష్టం చేశాడు. తాజాగా అనుజాతో పెళ్లి కుదిరిన నేపథ్యంలో సందేహాలకు తెరపడినట్లే. 


Also Read: తెలుగులో ‘మనీ హీస్ట్’ పార్ట్-5: ప్రొఫెసర్ చనిపోతారా? తెరపైకి టోక్యో ఫ్లాష్‌బ్యాక్!
Also Read: ‘మణికే మాగే హితే’.. ఈ వైరల్ సాంగ్ పాడిన యొహానీ ఎవరో తెలుసా?