ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో విద్యార్థికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని సి.బెళగల్ మండలం బూరందొడ్డి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఘటన చోటుచేసుకుంది. మంగళవారం యథావిధిగా పాఠశాల ప్రారంభమైంది. మధ్యాహ్నం సమయంలో ఐదో తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. దీంతో మహేంద్ర అనే విద్యార్థి తలకు గాయాలయ్యాయి. నందకిషోర్‌ రెడ్డి, జగదీష్‌ నాయుడు అనే మరో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. 
నాసిరకం పనుల వల్లే..
ఘటన జరిగిన సమయంలో తరగతి గదిలో 25 మంది విద్యార్థులు ఉన్నారు. మహేంద్రను తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాలుడి తలకు ఐదు కుట్లు పడ్డాయని తండ్రి సుంకన్న తెలిపారు. నాడు-నేడు కింద ప్రభుత్వం చేపట్టిన పాఠశాల పైకప్పు పనులు పూర్తి కాకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. 
ఘటనకు సంబంధించి పాఠశాల ఉపాధ్యాయుడు కృపానందంను వివరణ కోరగా.. 2 నెలల క్రితం మొదటి దశ నాడు-నేడు కింద పైకప్పు పనులు చేశారని తెలిపారు. కాగా, ఈ పాఠశాలలో మొత్తం 145 వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పై అంతస్తులో సుమారు 48 మంది విద్యార్థులు ఉన్నారు.


పాఠశాలలు తెరిచి పక్షం రోజులు.. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తర్వాత స్కూళ్లు తెరిచి దాదాపు 15 రోజులు అవుతుంది. కోవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఏడాదిన్నర క్రితం పాఠశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో స్కూళ్లను తిరిగి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లో కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించడంతో పాటు విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు చేపట్టినట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ప్రతి ఒక్క విద్యార్థి మాస్క్ ధరించాలనే నిబంధన కూడా పెట్టినట్లు తెలిపారు. 


ఏపీలో పాఠశాలలు తెరిచిన కొద్ది రోజుల్లోనే సుమారు 50 మంది విద్యార్థులు, 31 మంది టీచర్లు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి.. కేసులు నమోదైన పాఠశాలలపై ప్రత్యేక దృష్టిపెట్టామని చెప్పారు. ఆయా పాఠశాలలో విడతల వారీగా క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు. 


Also Read: ఏ నెల పింఛను ఆ నెలలోనే.. 2 నెలలది ఒకేసారి ఇవ్వడం కుదరదు.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం..


Also Read: Warangal Crime: వరంగల్‌లో దారుణం.. సొంత అన్న ఫ్యామిలీపై కత్తులతో దాడి, అంతా నిద్రిస్తుండగా ఘోరం