గులాబ్ తుపాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడుతోంది. తుపాన్ కారణంగా రాబోయే రెండు రోజుల్లో హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్‌ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) అప్రమత్తమైంది. రాబోయే మూడు రోజుల పాటు హై అలర్ట్ ప్రకటిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ విపత్తుల నిర్వహణ విభాగం వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని క్షేత్ర స్థాయిలో సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని.. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, హెచ్‌ఓడీలను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో పడవలు, పంపులు, ఇతర అవసరమైన యంత్రాలు, పరికరాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలి..
గతంలో భారీ వర్షాలు, వరదలు వంటివి వచ్చినప్పుడు ప్రజలకు పలు సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఈసారి ముందస్తు ఏర్పాట్లు తీసుకునేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. అత్యవసర స్థితిని ముందుగానే అంచనా వేసుకోవాలని జీహెచ్ఎంసీ యంత్రాంగం అధికారులకు సూచించింది. లోతట్టు ప్రాంతాలను తనిఖీ చేసి నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించే విధంగా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని తెలిపింది.
వీకాఫ్‌లు, సెలవులు వారం పాటు పరిమితంగా తీసుకోవాలని పేర్కొంది. తుపాను తీవ్రత తగ్గే వరకు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండేలా ప్రణాళిక వేసుకోవాలని అధికారులకు సూచించింది. ముంపు ప్రాంతాల వారినిను తరలించాల్సి వచ్చినా అందుకు అనుగుణంగా పునరావాస కేంద్రాలను ముందే సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. పునరావాస కేంద్రాల్లో ప్రాథమిక సౌకర్యాలు ఉండేలా చూడాలని ఆదేశించింది. రవాణా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. వరదలు, లోతట్టు ప్రాంతాల వారిని ముందస్తుగా హెచ్చరించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
Also Read: Cyclone Gulab: గులాబ్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో అలర్ట్
రాష్ట్రంపై తుపాన్ ఎఫెక్ట్..
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ఢిల్లీ నుంచి ఆయన కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఇవాళ రాత్రి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంపై తుపాన్ ప్రభావం ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్, దక్షిణ తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాల్లో పోలీసులు, ఇతర శాఖ అధికారులతో కలిసి పని చేయాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎస్.. కలెక్టర్లకు సూచించారు. కట్టలు తెగే అవకాశమున్న చెరువులపై నిఘా వేయాలని.. అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఒకవేళ అవసరమైతే జిల్లాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ సేవలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. వరద ప్రవహించేటప్పుడు వాగులు, వంకలు దాటవద్దని ప్రజలను కోరారు.
Also Read: Cyclone Gulab: పలాస, టెక్కలి మధ్య తీరం దాటనున్న గులాబ్ తుపాను.. ప్రజలను అప్రమత్తం చేసిన ఏపీ మంత్రి
Also Read: Cyclone Gulab Live Updates: తీరాన్ని తాకిన గులాబ్ తుపాను... భారీగా ఈదురుగాలులు