నిజజీవితాల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెపరేట్ స్టయిల్ ఉంది. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లు, రాజకీయ నాయకులు, సినీ తారలు ఇలా ఎవరి జీవితం ఆధారంగానైనా సినిమాలు చేసేస్తుంటారు. గతంలో పరిటాల రవి జీవిత కథాంశంతో వర్మ తెరకెక్కించిన 'రక్తచరిత్ర' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇదే తరహాలో ఆయన మరో రాజకీయ నేత నిజజీవితకథను సినిమాగా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. 

 


 

తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు కొండా మురళీధర్ రావు, సురేఖ దంపతుల జీవితాన్ని ఆర్జీవీ వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సినిమాకి 'కొండా' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా ఆర్జీవీ తన వాయిస్ ఓవర్ తో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఆయన ఏం మాట్లాడారంటే.. 

 

''నేను విజయవాడలో చదవడం మూలాన నాకు రౌడీల గురించి తెలుసు. రామానాయుడు గారి స్టూడియో దగ్గర జరిగిన బ్లాస్ట్ మూలాన రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ ల గురించి తెలుసుకున్నాను. కానీ తెలంగాణ సాయుధ పోరాటం గురించి మొన్నమొన్నటివరకు కూడా ఏమీ తెలియదు. ఈ మధ్య కో ఇన్సిడెంటల్ గా నేను కలిసిన కొంతమంది మాజీ నక్సలైట్లు, ఇంకొంతమంది అప్పటి పోలీస్ ఆఫీసర్ల నుంచి నాకు ఫస్ట్ టైమ్ ఆ సబ్జెక్ట్ మీద ఒక అవగాహన వచ్చింది. నేను విన్న విషయాల్లో నన్ను ముఖ్యంగా విపరీతంగా ఆకర్షించింది ఎన్ కౌంటర్ లో చంపేయబడ్డ ఆర్కే అలియాస్ రామకృష్ణకి ఇంకా కొండా మురళికి ఉన్న మహా ప్రత్యేకమైన సంబంధం. ఆ ఎక్స్ట్రాడినరీ బ్యాక్ గ్రౌండ్, అప్పటి పరిస్థితులను సినిమాటిక్ గా క్యాప్చర్ చేయడానికి నేను మురళీ గారిని కూడా కలిసి ఆయన ద్వారా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కోఆపరేట్ చేయమని కోరడం జరిగింది. ఈ సినిమా తీయడం వెనుకున్న నా ఉద్దేశం విని ఆయన కూడా ఒప్పుకున్నారు. పెత్తందారుల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి. అలా ఎదురుతిరిగిన వాళ్లను ఉక్కుపాదాలతో తొక్కిపారేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. మురళీ, ఆర్కే లాంటి వాళ్ల నాయకత్వంలో తిరుగుబాటు చేసేవారు. విపరీత పరిస్థితుల నుంచే విపరీతవ్యక్తులు ఉద్భవిస్తారని చచ్చి ఏలోకాన ఉన్నాడో కానీ కార్ల్ మార్క్స్ 180 ఏళ్ల క్రితమే చెప్పాడు. అలాంటి విపరీత పరిస్థితుల మధ్య పుట్టినవారు కొండా మురళి, కొండా సురేఖ. నేను తీస్తున్నది సినిమా కాదు.. నమ్మశక్యం కాని నిజజీవితాల ఆధారంగా తీస్తున్న తెలంగాణలో జరిగిన రక్తచరిత్ర. 80లలో మొదలైన ఆ చరిత్ర కోరలు ఇప్పటి రాజకీయాలను కూడా కరుస్తూనే ఉన్నాయి. మున్ముందు రాజకీయాలను కూడా కరుస్తూనే ఉంటాయి. ఎందుకంటే విప్లవం అనేది ఎప్పటికీ ఆగడు. దాని రూపు మార్చుకుంటుంది అంతే. 'కొండా' సినిమా చిత్రీకరణ వరంగల్, పరిసర ప్రాంతాల అడవుల్లో జరగనుంది. మా చిత్ర విప్లవం అతి త్వరలో మొదలవబోతుంది'' అంటూ చెప్పుకొచ్చారు.

 


 



 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి