VH Complaint Aganist Actress Kangana Ranaut In Hyderabad: బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై (Kangana Ranaut) కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు (V Hanumantha Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె పాపులారిటీ కోసమే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు అనంతరం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. 'ఓ మహిళా సీఆర్పీఎఫ్ అధికారి చెంపదెబ్బ కొట్టినా కంగనా తీరు మారడం లేదు. రాహుల్ గాంధీపై ఆమె అసత్య ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ చెత్తగా మాట్లాడుతున్నారని కంగనా వ్యాఖ్యానించడం మమ్మల్ని బాధించింది. ఏదైనా ఉంటే పార్లమెంట్‌లో మాట్లాడాలి. ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. రాహుల్ గాంధీకి కంగనా వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి.' అని వీహెచ్ డిమాండ్ చేశారు.


కంగనా రనౌత్ లాంటి వారిని బీజేపీ ప్రోత్సహిస్తే ప్రజలు తిరగబడతారని వీహెచ్ అన్నారు. ఆమెను నియంత్రించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మీద ఉందని పేర్కొన్నారు. కంగనా రాహుల్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని.. ఆమెపై కేసులు నమోదు చేయాలని డీజీపీ, కమిషనర్లకు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. సినిమా జీవితంలో ఎలా ఉన్నా ఆమెకు రాజకీయాలు ఒంటపట్టలేదని ఎద్దేవా చేశారు. కంగనా రైతుల వ్యతిరేకి అని మండిపడ్డారు.


హైడ్రా చర్యలపై..


అటు, హైదరాబాద్‌లో అక్రమ కూల్చివేతలపైనా స్పందించిన వీహెచ్.. హైడ్రా అధికారి రంగనాథ్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన మంచిపని చేస్తున్నారని.. ఆయన్ను అభినందిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ పేదల ఇల్లు కూల్చితే వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలన్నారు. కొందరు శ్మశానవాటికలు కూడా ఆక్రమించి ఇళ్లు కడుతున్నారని వాటిని నిలువరించాలని సూచించారు.


Also Read: Telangana: ఓటుకు నోటు కేసులో బిగ్ అప్‌డేట్‌- మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలన్న పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు