TTD New Policy For Laddu Prasadam: తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ జారీ విధానంలో టీటీడీ (TTD) మార్పులు చేసింది. ఇకపై భక్తులు ఆధార్ కార్డు చూపిస్తేనే లడ్డూలు జారీ చేయాలని దేవస్థానం నిర్ణయించింది. గురువారం నుంచి ఈ నూతన విధానం అమల్లోకి తెచ్చింది. ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా రూల్స్ మార్చింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టికెట్‌పై ఒక్క లడ్డూను మాత్రమే ఇవ్వనున్నారు. అంతకు ముందు దర్శన టోకెన్‌పై ఒక భక్తునికి రెండు లడ్డూలు ఇచ్చేవారు. దర్శనం టికెట్‌పై ఒక లడ్డు, ఆధార్ కార్డు చూపిస్తే మరో లడ్డును భక్తులకు అందించనున్నారు. అయితే, టీటీడీ నిర్ణయంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారి ప్రసాదంపై ఆంక్షలు విధించడం సరికాదని అంటున్నారు.
మరోవైపు, లడ్డూ ప్రసాదం తయారీకి కర్ణాటక ప్రభుత్వం నెయ్యి సరఫరాను మళ్లీ ప్రారంభించింది. నందిని బ్రాండ్ నెయ్యి సరఫరాను టీటీడీకి మళ్లీ ప్రారంభించగా.. బుధవారం రాత్రి మొదటి లోడును ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య జెండా ఊపి ప్రారంభించారు. గత వైసీపీ హయాంలో ధర విషయంలో అంగీకారం కుదరక గతేడాది సెప్టెంబర్ నుంచి నెయ్యి సరఫరా నిలిపేశారు. ఇటీవల 350 టన్నుల నెయ్యి సరఫరా చేయాలని టీటీడీ కోరడంతో సరఫరాను తిరిగి ప్రారంభించినట్లు కర్ణాటక పాల సమాఖ్య అధికారులు తెలిపారు.
లక్కీ డిప్ ద్వారా ఆ టోకెన్లు
ప్రతి శనివారం తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులకు కేటాయిస్తోన్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టోకెన్లను ఇకపై, లక్కీ డిప్ ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ టికెట్లు కావాల్సిన భక్తులు గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ తమ ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. వీరికి సాయంత్రం 5 గంటలకు లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తామని వెల్లడించారు. టికెట్లు పొందిన భక్తుల మొబైల్‌కు మెసేజ్ పంపిస్తామని.. ఈ సమాచారం ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచుతామన్నారు.
లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు ఆన్‌లైన్‌లో రూ.500 డిపాజిట్ చేయాలని సూచించారు. వీరు మహతి కళాక్షేత్రంలో ఆధార్ కార్డు చూపించి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ అంగప్రదక్షిణ టికెట్లు పొందవచ్చని తెలిపారు. టికెట్లు పొందిన భక్తులకు శనివారం తెల్లవారుజామున అంగప్రదక్షిణకు అనుమతిస్తామన్నారు. అనంతరం భక్తులు చెల్లించిన రూ.500 డిపాజిట్‌ను వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులు కాని భక్తులకు.. లక్కీ డిప్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు పొందిన వారికి డిపాజిట్ డబ్బులు తిరిగి చెల్లించమని చెప్పారు.
భారీ విరాళాలు
తిరుమల శ్రీవారికి బుధవారం భారీ విరాళాలు అందాయి. హైదరాబాద్‌కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు పొట్టి వెంకటేశ్వర్లు, రాజమౌలి, ప్రసాదరావు, మాలతీ లక్ష్మీకుమారిలు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.3.70 కోట్లు విరాళంగా అందజేశారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం చెక్కు అందజేశారు. అటు, పలమనేరుకు చెందిన రవీంద్రారెడ్డి టీటీడీకి రూ.10 లక్షల విలువైన టాటా యోధా బీఎస్‌వీఐ రవాణా వాహనాన్ని అందజేశారు. ఆలయం ఎదుట వాహనానికి పూజలు నిర్వహించి అదనపు ఈవోకి తాళాలు అందించారు.
భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకూ 65,131 మంది స్వామిని దర్శించుకోగా.. వీరిలో 30,998 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. బుధవారం స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు లభించినట్లు అధికారులు తెలిపారు.