Floods in Gujarat: గుజరాత్‌లో దాదాపు నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ వర్షాల కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు 18 వేల మందిని ముంపు ప్రాంతాల నుంచి వేరే చోటకు తరలించారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో భారీ వానలు కురిసే అవకాశముందని IMD హెచ్చరించింది. గుజరాత్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం...వడోదర, జామ్‌నగర్, ద్వారకా సహా పలు జిల్లాల్లో పలువురు మృతి చెందారు.


ట్రాక్టర్‌పై ప్రయాణిస్తుండగా వరద నీటిలో కొట్టుకుపోయి ఏడుగురు గల్లంతయ్యారు. 22 జిల్లాలకు IMD ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. కచ్, సౌరాష్ట్ర, మోర్బి, జునాగధ్‌ సహా మరి కొన్నిచోట్ల ఎల్లో అలెర్ట్ జారీ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలోని పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కి ఫోన్‌ చేసి మాట్లాడారు. కేంద్రం తరపున రాష్ట్రానికి అన్ని విధాలా సాయం అందుతుందని హామీ ఇచ్చారు. వడోదరలో ప్రస్తుతానికి వరదలు ఆగిపోయినప్పటికీ లోతట్టు ప్రాంతాలకు మాత్రం ముప్పు తప్పేలా లేదు. పెద్ద ఎత్తున నీళ్లు వచ్చి చేరుతున్నాయి. విశ్వమిత్రి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. 






వరద బాధితులను కాపాడేందుకు NDRF సిబ్బంది రంగంలోకి దిగింది. నదులు, డ్యామ్‌లు ఉప్పొంగుతున్న ప్రాంతాల్లో దాదాపు 6 వేల మందిని వేరే చోటకు తరలించారు. అయితే...ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ మరింత సహకరించాలని కోరుతోంది. ఆరు టీమ్స్‌ని పంపించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతానికి NDRFతో పాటు SDRF బృందాలూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అయితే..ఈ వరదలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.