Young Woman Murdered In Gachibowli: హైదరాబాద్ (Hyderabad) గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో ఓ యువతి మృతి చెందగా.. మరో ముగ్గురు యువతులకు గాయాలయ్యాయి. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన రాకేశ్ మాదాపూర్‌లోని (Madhapur) ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. పశ్చిమబెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్ అనే యువతి నల్లగండ్లలో బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. ఆమె గోపన్‌పల్లి తండా సమీపంలో స్నేహితులతో నివాసం ఉంటోంది. కొంతకాలంగా రాకేశ్, దీపన మధ్య పరిచయం ఉండగా.. తనను పెళ్లి చేసుకోవాలని ఏడాది నుంచి రాకేశ్ ఆమె వెంట పడుతున్నాడు. ఇందుకు దీపన నిరాకరించింది.


కత్తితో దాడి


ఈ క్రమంలోనే బుధవారం రాత్రి యువతి ఇంటికి వెళ్లిన రాకేశ్ ఆమెతో గొడవపడ్డాడు. దీంతో ఆవేశంతో పక్కనే ఉన్న కూరగాయల కత్తితో దీపనపై రాకేశ్ దాడి చేయగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని అడ్డుకునేందుకు యత్నించిన దీపన స్నేహితులపైనా దాడికి పాల్పడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు వీరిని గమనించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దీపన మృతి చెందింది. 


విద్యుత్ తీగలు పట్టుకుని..


కాగా, యువతిపై దాడి అనంతరం అక్కడి నుంచి వెళ్లిన రాకేశ్.. మొయినాబాద్ సమీపంలోని కనకమామిడి వద్ద ఆత్మహత్యకు యత్నించాడు. విద్యుత్ స్తంభం ఎక్కేందుకు ప్రయత్నించి షాక్‌కు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మరో ఘటనలో..


అటు, మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై మరో ముగ్గురు యువకులు వైర్లు, గ్యాస్ పైపులతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పీఎస్ పరిధి వినాయక్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 2లో బుధవారం రాత్రి కల్యాణ్ అనే యువకునిపై ముగ్గురు యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. విఘ్నేశ్వర వసతి గృహంలో 4 నెలల క్రితం నివాసం ఉన్న కళ్యాణ్ హాస్టల్ ఫీజు కట్టలేక హాస్టల్ వదిలి వెళ్లిపోయాడని.. గత రాత్రి రూ.17,000 చెల్లిద్దామని తీసుకొని రాగా హాస్టల్ నిర్వాహకులు ఆ డబ్బులు తీసుకోకుండా వెనక్కి వెళ్లాలని కోరారు.


ఈ క్రమంలోనే తిరిగి వెళ్లిపోయిన కల్యాణ్‌ను ముగ్గురు యువకులు  వైర్లు, గ్యాస్ పైపులతో కొడుతూ హాస్టల్ ఆవరణలో తీవ్రంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయాలతో కల్యాణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మేడ్చల్ సీఐ సత్యనారాయణ, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ నరసింహులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రాథమిక విచారణ చేపట్టారు. హాస్టల్ నిర్వాహకులను ప్రశ్నించారు. యువకుని హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.


Also Read: Hyderabad Crime: పెట్రోల్ దొంగతనం చేస్తుండగా అడ్డుకున్న బైక్ యజమాని, తుపాకీతో నిందితుల కాల్పులు