BRS Dharnas :  ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చిన రోజునే  నిరసనలు హోరెత్తించాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది.  సింగ‌రేణి ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఈ నెల 8వ తేదీన సింగ‌రేణి ప్రాంతాల్లో బీఆర్ఎస్ మ‌హా ధ‌ర్నాలు చేప‌ట్ట‌నుంది. ఈ మేర‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  పిలుపుని చ్చారు. మంచిర్యాల‌, భూపాల‌ప‌ల్లి, కొత్త‌గూడెం, రామ‌గుండం ఏరియాల్లో మ‌హా ధ‌ర్నాలు చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. సింగ‌రేణిని ప్ర‌యివేటీక‌రించ‌బోమ‌ని రామగుండంలో ప్ర‌ధాని మోదీ మాట ఇచ్చి త‌ప్పార‌ని కేటీఆర్ గుర్తు చేశారు. లాభాల్లో ఉన్న సిగ‌రేణిని ప్ర‌యివేటీక‌రించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? అని ప్ర‌శ్నించారు. వేలం లేకుండా సింగ‌రేణికి బొగ్గు గ‌నులు కేటాయించాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు.  


రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇస్తున్న సీఎం కేసీఆర్ సంక‌ల్పాన్ని దెబ్బ‌తీసేందుకే కేంద్రం కుట్ర చేస్తుంద‌ని మండిప‌డ్డారు. తెలంగాణ‌కు సింగ‌రేణి ఓ ఆర్థిక‌, సామాజిక జీవ‌నాడి లాంటింద‌ని పేర్కొన్నారు. సింగ‌రేణి ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై కేంద్రం వెన‌క్కి త‌గ్గ‌కుంటే జంగ్ సైర‌న్ మోగిస్తాం.. మ‌రో ప్ర‌జా ఉద్య‌మం నిర్మిస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి ఈ నెల ఎనిమిదో తేదిన హైద‌రాబాద్ కు రానున్నారు.. ఈ సంద‌ర్బంగా ఆయ‌న వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంఖుస్థాప‌న‌లు, ప్రారంబోత్స‌వాలు చేయ‌నున్నారు. అదే రోజున బీఆర్ఎస్  నిర‌స‌న కార్యక్ర‌మాల‌కు బిఆర్ఎస్ పార్టీ పిలుపు ఇచ్చింది .  


తెలంగాణలో బొగ్గు గనుల ప్రైవేటీకరణ సాధ్యం కాదని కేంద్రం చెబుతోంది.  బొగ్గు గనుల్లో కేంద్రానికి 49 శాతం వాటా మాత్రమే ఉందని చెబుతున్నారు. మెజార్టీ వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని కేంద్రం ఎలా ప్రైవేటీకరణ చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.    సింగరేణి ప్రైవేటీకరిస్తారంటూ చాలా కాలం నుంచి కేసీఆర్‌తో పాటు ఇతర నేతలు ప్రచారం చేస్తున్నారని గతంలో బీజేపీ ప్రకటన చేసింది. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని చాలా సార్లు ప్రకటించారు.  సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్రం వాటా కేవలం 49 శాతం మాత్రమే. ప్రైవేటీకరణ చేసే అధికారం కేంద్రానికి ఉండదు. మెజార్టీ వాటా రాష్ట్రానిదైతే కేంద్రం ఎలా విక్రయిస్తుంది?. బొగ్గు గనులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారు. పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని గతలో మోదీ ఆరోపించారు.  


తెలంగాణలోని కోల్ బ్లాకులను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.  అయితే తెలంగాణలో ఉన్న ఈ కోల్ బ్లాకులను తమకే అప్పగించాలని సింగరేణి సంస్థ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు.    కళ్యాణ ఖని బ్లాక్ - 6, కోయగూడెం బ్లాక్ -lll, సత్తుపల్లి బ్లాక్ -lll, పల్లి శ్రావణ్ పల్లి కోల్ బ్లాకులను విక్రయించేందుకు బహిరంగ టెండర్ పిలిచారు.   నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 ప్రకారం కోల్ మైన్స్ బ్లాక్ లోను బహిరంగ టెండర్ ద్వారా విక్రయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అయితే ఆ బొగ్గు గనులను వేలం వేయడం అంటే సింగరేణిని ప్రైవేటీకరణ చేయడమేనని బీఆర్ఎస్ భావిస్తోంది.. అందుకే ఉద్యమం   చేయాలని నిర్ణయించుకుంది.