హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో వరుసగా రెండో రోజు భారీ వర్షం కురుస్తోంది. బుధవారం సాయంత్రం, రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గురువారం సైతం నగరంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, అంబర్ పేట పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వర్షం పడింది. మధ్యాహ్నం 2 గంటల తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, ప్రకాష్ నగర్, బేగంపేట్, అంబర్ పేట ఏరియాలలో భారీ వర్షం కురిసింది.
కాచిగూడ, సైదాబాద్, తార్నాక, హబ్సిగూడ, నారాయణగూడ, లాలాపేట్, నాచారం, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల వర్షం నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం తలెత్తింది. పంజాగుట్ట, బాగ్‌లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కోఠి, అబిడ్స్ లోనూ మోస్తరు వర్షం కురిసింది. వరుసగా రెండో రోజు వర్షం కురవడంతో వాతావరణం కాస్త చల్లబడింది. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా దిగొస్తున్నాయి. ఇదివరకే తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. కొన్ని జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో వర్షం కురుస్తోంది.
Weather Warnings: వాతావరణ హెచ్చరికలు
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ రేపు, ఎల్లుండి కురిసే అవకాశం ఉంది. ఇంకా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు ( గాలి గంటకు 30 నుండి 40 కి మీ వేగం ) తో పాటు వడగళ్లతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
నేడు తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.7 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 55 శాతం నమోదైంది.