గోషామహల్ కు చెందిన బీజేపీ ఎంపీ రాజసింగ్‌ను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హనుమాన్ జయంతి కార్యక్రమం ర్యాలీ నేపథ్యంలో ఆయన్ను ఇంట్లోనే అరెస్ట్ చేసి ఉంచారు. వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గౌలిగూడ దేవాలయం నుండి తాడ్ బంద్ హనుమాన్ దేవాలయం వరకు హనుమాన్ ర్యాలీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ ర్యాలీ పాల్గొంటూ వస్తున్నారు. ఈరోజు కూడా ఆ ర్యాలీలో పాల్గొనాల్సి ఉండగా, అందులో పాల్గొనకుండా ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తీరుపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 8వ నిజాం పాలన నడుస్తోందని విమర్శలు చేశారు. ప్రశ్నించే గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, బండి సంజయ్ ని అరెస్ట్ చేసి అలాగే జైలులో పెట్టారని అన్నారు. మరోవైపు, తనను కూడా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇటీవల వారం రోజుల క్రితం శ్రీరామనవమి సందర్బంగా రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు రాజాసింగ్‌పై కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలోనే హనుమాన్ జయంతి సందర్భంగా ముందస్తుగా రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆయన ర్యాలీలో పాల్గొంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో హౌస్ అరెస్టు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. ‘‘ఏటా నేను హనుమాన్ జయంతి ఉత్సవాల్లో నిర్వహించే బైక్ ర్యాలీలో పాల్గొంటా. కానీ, ఈసారి మాత్రమే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పాలి. నన్ను అరెస్ట్ చేస్తే తర్వాత జరిగే విధ్వంసాలు, అనర్థాలకు నేను మాత్రం బాధ్యుడిని కాను.’’ అని అన్నారు.
ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు
హనుమాన్ యాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11.30 గంటల సమయంలో గౌలిగూడ రామమందిరం నుంచి యాత్ర ప్రారంభం కానుండగా, రాత్రి 8 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ తాడ్‌బంద్ హనుమాన్ దేవాలయం వద్ద యాత్ర ముగియనుంది. గౌలిగూడ, పుత్లిబౌలి, కోఠి, సుల్తాన్‌బజార్, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్, గాంధీనగర్, కవాడీగూడ, బైబిల్ హౌస్, రాంగోపాల్ పేట్, ప్యారడైజ్ ప్రాంతాల మీదగా తాడ్‌బంద్ దేవాలయం వరకు మొత్తం 12 కిలోమీటర్లు హనుమాన్ విజయ యాత్ర జరుగుతుంది.
హనుమాన్ విజయ యాత్రను పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఇంకా సుధీర్ బాబు మాట్లాడుతూ.. సౌత్ వన్ వైపు వెళ్లేవారు కూడా ఈ రూట్ ఎలా తీసుకోవాలంటే వయా కోటి, బ్యాంక్ స్ట్రీట్, ఛాదర్ ఘాట్, బషీర్‌బాగ్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, హిమాయత్ నగర్ వై జంక్షన్, నారాయణగూడ ఫ్లైఓవర్, బర్కత్‌పుర,ఫీవర్ హాస్పిటల్, చే నంబర్, అలీకే, ముసరాంబాగ్, దిల్‌సుఖ్ ననగర్ గుండా వెళ్లవచ్చని సుధీర్‌బాబు చెప్పారు. విజయ యాత్రకు 750 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించనున్నారని చెప్పారు.
ఈ నెంబర్ల ద్వారా ఫిర్యాదులు చేయొచ్చు
వాహనదారులకు సమస్యలు ఎదురైతే సామాజిక మాధ్యమాల ద్వారా లేదా టోల్ ఫ్రీ నెంబర్ 9010203626 ద్వారా, ట్రాఫిక్ కంట్రోల్ రూం 040 27852482 ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చని సుధీర్ బాబు తెలిపారు. twitter.com/HYDTP, facebook.com/HYDTP ద్వారా కూడా వాహనదారులు ఫిర్యాదు చేయవచ్చని ట్రాఫిక్ అదనపు సీపీ తెలిపారు. వాహనదారులు, భక్తులు ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నారు.