KCR will become CM soon:  త్వరలో మా పార్టీ వారు ముఖ్యమంత్రి అవుతారని అవుతారని ఎవరైనా చెప్పుకుంటారు. కానీ పక్క పార్టీ వాళ్లు సీఎం అవుతారని చెప్పడం కష్టం. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం అలాంటి ప్రకటనలు చేస్తూంటారు. త్వరలో కేసీఆర్ సీఎం అవుతారని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని.. రేవంత్ ను తప్పించి.. సీఎంగా కేసీఆర్ ను నియమిస్తారని ఆయన జోస్యం చెప్పారు.  

హరీష్ రావు వ్యాఖ్యలకు అదే అర్థమంటున్న బీజేపీ నేత ప్రభాకర్    

ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తనకు ఉన్న సమాచారం ఏమిటో కూడా చెప్పారు. మంగళవారం బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు ప్రెస్ మీట్ లో కొన్ని విషయాలపై ప్రత్యేకంగా మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విబేధాలు లేవన్నారు. కేసీఆర్ మాటే తన  బాట అని స్పష్టం చేశారు. కేటీఆర్ కు పార్టీ నాయకత్వ పగ్గాలు  అప్పగించినా తాను స్వాగతిస్తానని చెప్పారు. హరీష్ రావు సొంత పార్టీ పెట్టబోతున్నారని లేకపోతే పార్టీ మారుతారని ఇటీవల ప్రచారం జరుగుతూండటంతో ఆయ న ఈ వివరణ ఇచ్చారు. ఇలా వివరణ ఇవ్వడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు అనిపించింది. 

కేసీఆర్ సీఎం .. రేవంత్ ను తప్పిస్తారు !                  

అందుకే  ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టి  కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ముహుర్తం ఖరారు అయిందని స్టేట్ మెంట్ ఇచ్చారు. జూన్ రెండో తేదీన లేదా డిసెంబర్ లో విలీనం ఉంటుందని తర్వాత కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేస్తారన్నారు. రేవంత్ రెడ్డి మార్పు ఖాయమని చెప్పుకొచ్చారు బీజేపీ నేతల మాటల్లో  లాజిక్ ఉన్నా లేకపోయినా ఈ విలీనం అనే మాట కాస్త నమ్మశక్యంగా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.  కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం చేసే ఆలోచన ఉన్నట్లయితే  .. ఇటీవల భారీగా ఖర్చు పెట్టుకుని రజతోత్సవ వేడుకలు నిర్వహించాల్సిన అవసరం ఉండేది కాదని అంటున్నారు.  ఇప్పటికిప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉందని కూడా అనుకోలేరని..  ఇలాంటి సమయంలో పార్టీని విలీనం చేస్తారని బీజేపీ నేతలు ఎలా అనుకుంటారన్న ప్రశ్నలు వస్తున్నాయి. 

జరిగితే బీజేపీలోనే జరగొచ్చంటున్న కాంగ్రెస్ నేతలు                  

మరో వైపు కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమైనా బీఆర్ఎస్ విలీనం అంటూ జరిగితే అది బీజేపీలోనేనని అంటున్నారు. అందుకే ఇప్పుడు వారు బీజేపీపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం రెండు జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని..  తెలంగాణలో తెలంగాణ పార్టీ తప్ప మరో దానికి చోటు లేదని అంటున్నారు. అయితే  మైండ్ గేమ్‌లను మాత్రం జోరుగా చేసుకుంటున్నారు.