Attack on Teenmar Mallanna: బీజేపీ నేత, ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న (అలియాస్ చింతపండు నవీన్‌)పై దాడి జరిగింది. హైదరాబాద్ మేడిపల్లిలోని శనార్థి తెలంగాణ కార్యాలయంలోకి శుక్రవారం రాత్రి దూసుకొచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తీన్మార్ మల్లన్నపై దాడి చేశారు. కార్యాలయంలో చొచ్చుకొచ్చిన దుండగులు బూతులు తిడుతూ తీన్మార్ మల్లన్నను కించపరిచారు. అంతటితో ఆగకుండా ఆయన చెప్పే మాటల్ని చెవికెక్కించుకోకుండా భౌతిక దాడులకు దిగారు. చెం మీద కొట్టారు. తీన్మార్ మల్లన్నపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆఫీసు సిబ్బందిని సైతం దూషిస్తూ దుండగులు రచ్చరచ్చ చేశారు. 
శనార్థి తెలంగాణ కార్యాలయంలో వస్తువులను దుండగులు ధ్వసం చేశారు. తీన్మార్ మల్లన్న ఆఫీసులో ఉన్న టీవీలు, కంప్యూటర్స్, ఇతర ఫర్నిచర్‌ని ధ్వంసం చేస్తూ రభస చేశారు. అయితే తీన్మార్ మల్లన్న చెప్పే మాటల్ని వినిపించుకోకుండా.. ఉద్దేశపూర్వకంగానే దుండగులు ఆయనపై దాడికి పాల్పడుతున్న సమయంలో చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీఆర్ఎస్ నేతలు సైతం ఈ వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. తప్పు చేసినంత మాత్రాన కొడతారా పాపం అంటూ టీఆర్ఎస్ నేత ఒకరు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో విషయం వైరల్ అయింది. 
తన ఆఫీసుపై దాడులు జరుగుతున్నాయని మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని తీన్మార్ మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. తనపై గుర్తు తెలియని దుండగులు చేసిన దాడికి సంబంధించిన వీడియోను తీన్మార్ మల్లన్న సైతం మీడియాకు విడుదల చేశారు. ఇది కచ్చితంగా టీఆర్ఎస్ గూండాల పనే అని ఆరోపించారు. తాజాగా తనపై జరిగిన దాడిపై కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను తీన్మార్ మల్లన్న కోరారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు ఈ దాడికి ప్లాన్ చేశారని బాధితుడు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని తనదైన శైలిలో విమర్శిస్తున్న తనపై ఉద్దేశపూర్వకంగానే కొంత మంది టీఆర్ఎస్ పార్టీ గూండాలు దాడులకు పాల్పడుతున్నారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. 






అసలేం జరిగిందంటే.. 
కొందరు వ్యక్తులు శుక్రవారం రాత్రి శనార్థి తెలంగాణ కార్యాలయానికి వచ్చారు. అయితే వచ్చిన వ్యక్తులకు తమ సిబ్బంది కూర్చీలు వేస్తుండగా ఒక్కసారిగా దుండగులు రెచ్చిపోయారు. దూషిస్తూ దాడులకు దిగారని తీన్మార్ మల్లన్న చెబుతున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారని భావించామని, కానీ వారి ఉద్దేశం వేరే ఉందని కొంత సేపటికే తేలిపోయిందన్నారు. తనపై దాడికి పాల్పడిన వారు తాము కేటీఆర్ మనుషులమని వారే స్వయంగా చెప్పారని.. మేడిపల్లి పోలీసులు 24 గంటల్లోగా నిందితులను అరెస్ట్ చేసి చూపించాలని సవాల్ విసిరారు. తన ఆఫీసు నుంచే మేడిపల్లి ఎస్ఐకి తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. అయితే పీఎస్‌కు వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినట్లు సమాచారం.


Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్‌ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్‌!


Also Read: Gold Silver Price Today: నిలకడగా బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి ధర.. తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ రేట్లు ఇవీ..


Also Read: Delmicron Varient: ఒమిక్రాన్ తర్వాత పొంచి ఉన్న మరో వేరియంట్, ఆ రెండూ కలిసిపోయి కొత్తగా.. దీని తీవ్రత ఎంతంటే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి