Breaking News Live Telugu Updates: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం, నిలిచిన టికెట్ల జారీ
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
Hyderabad Metro Trains :హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టికెట్ల జారీ నిలిచిపోయింది. నగరంలోని పలు మెట్రో స్టేషన్లలో భారీ క్యూలైన్లలో ప్రయాణికులు టికెట్ల కోసం వేచిఉన్నారు. హైదరాబాద్ లో భారీ వర్షానికి ఉద్యోగులు, వ్యాపారస్తులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. దీంతో మెట్రో ట్రైన్లలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంది.
Karimnagar News : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ రాజీవ్ రహదారిపై కారును లారీ ఢీకొట్టింది. అతి వేగంతో వచ్చిన లారీ వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో కారు డివైడర్ దాటి ఎదురుగా వచ్చిన మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుల్తానాబాద్ పోలీసులు సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
- పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలో రాత్రి నుంచి దంచి కొడుతున్న వర్షం
- బెల్లంకొండ, అచ్చంపేట, అమరావతి,క్రోసూరు, పెదకూరపాడు మండలాల్లో భారీ వర్షం
- రోడ్లపై నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్న వాహన దారులు
- అచ్చంపేట -మాదీపాడు ప్రధాన రహదారిపై నిలిచిన వర్షపునీరు
దేశం కోసం తమ కుటుంబ సభ్యులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని అప్రతిష్ఠ పాలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఆరోపించారు. సోనియా గాంధీ పై ఈడీ కేసులను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తో పాటు ఎఐసిసి సభ్యురాలు గండ్రత్ సుజాత, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొని కేంద్రం తీరును ఖండించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి ఫ్లెక్సీని దహానం చేసి నిరసన తెలియజేశారు. సోనియాగాంధీ ని ఈడి కేసులతో అప్రతిష్టపాలు చేయడం సరికాదని, ఇప్పటికైనా బిజెపి కేంద్ర ప్రభుత్వం తమ మొండి వైఖరిని మానుకోవాలని డిమాండ్ చేశారు.
- గనుల శాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు, గుర్తింపు.
- ప్రధాన ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను ప్రశంసిస్తూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ నుంచి ఖనిజ వికాస్ అవార్డు.
- ఇటీవల ఢిల్లీలో మైన్స్ అండ్ మినరల్స్‌పై జరిగిన సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా అవార్డు అందుకున్న గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గనుల శాఖ డైరెక్టర్ వీజీ.వెంకటరెడ్డి.
- ఖనిజ వికాస్ అవార్డు క్రింద కేంద్ర గనుల శాఖ అందజేసిన రూ.2.40 కోట్లు ప్రోత్సాహక చెక్‌ను సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రికి చూపిన గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, డెరెక్టర్ వీజీ.వెంకటరెడ్డి.
తిరుమల శ్రీవారికి 25 ఎలక్ట్రికల్ స్కూటర్ ను విరాళంగా అందించారు TVS ప్రతినిధి వేణు శ్రీనివాసన్. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయం అనంతరం సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదుట 25 ఎలక్ట్రికల్ స్కూటర్లను ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం టీవీఎస్ ఎలక్ట్రికల్ స్కూటర్ల తాళాలను టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డికి అందించారు సంస్థ ప్రతినిధులు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేసిన టీటీడీ.... పొల్యూషన్ రహిత కార్లను వినియోగిస్తుందని సంస్థ ప్రతినిధి రాజా రెడ్డి తెలిపారు. తిరుమలను స్కూటర్ల నుంచి వెలువడే వాయు పొల్యూషన్ ను కొంతమేర నియంత్రించేందుకు టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ తనవంతు సహాయంగా 25ఎలక్ట్రికల్ వాహనాలను టీటీడీకి విరాళం అందించారన్నారు. ఈ వాహనాలు టీటీడీలో వివిధ విభాగాల్లో నేటి నుంచి వినియోగించుకోవాలని కోరారు. మొబైల్ ఛార్జింగ్ పెట్టిన విధంగా మూడు గంటల పాటు ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు హాయిగా వెళ్లవచ్చని సంస్థ ప్రతినిధి రాజారెడ్డి పేర్కొన్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 740 గ్రాముల అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర ఆ బంగారం పట్టుబడింది. నిందితుడు బంగారాన్ని జూసర్‌లోని రోలర్, ఎడ్జస్ వ్యాన్‌కు అమర్చుకుని తరలించేందుకు ప్రయత్నించగా టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. జ్యూసర్‌లో నుండి బంగారం వెలికి తీసిన కస్టమ్స్ అధికారులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని అర్హులైన పేద ప్రజల కోసం, జూబ్లీహిల్స్ రోడ్ నెం 45లోని అంబేద్కర్ నగర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం స్థలం కేటాయించింది. అయితే ప్రభుత్వం కేటాయించిన స్థలంలో స్థానిక ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దని, తమకు సొంత ఇల్లు కావాలి అంటూ ఇల్లు కట్టుకునేందుకు బస్తీవాసులు ప్రయత్నించారు. దీంతో విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు రెవిన్యూ సిబ్బంది ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఇళ్లను కూల్చి వేశారు. దీంతో స్థానిక ప్రజలు, రెవెన్యూ సిబ్బందికి మధ్య కొంత ఉద్రిక్తత నెలకొంది. చివరకు అధికారులు పోలీసులు స్థానిక ప్రజలను నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా రావడంతో చేసేదేమీలేక అధికారులు పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే, ఆ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అందజేసే ప్రక్రియ మొదలుపెట్టారని.. అందులో భాగంగానే కూల్చివేతలు ప్రారంభం అయ్యాయని స్థానికులు వాపోయారు.
Background
తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం తుఫాను ప్రసరణ జార్ఖండ్ మరియు దాని పరిసర ప్రాతాల్లో అధికంగా ఉంది. ఇది 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి దక్షిణం దిశగా వంగి ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం (జూన్ 22) భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.
ఈ వాతావరణ పరిస్థితుల వేళ ఉత్తర కోస్తా, యానం ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉంది. రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇటు దక్షిణ కోస్తాలో కూడా రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
హెచ్చరికలు
భారీ వర్షాలు, ఉరుములు, మెరుపుల నేపథ్యంలో ఐఎండీ కీలక వ్యాఖ్యలు చేసింది. వర్షాలు పడే సమయంలో ప్రజలు సరైన ప్రదేశంలో ఉండాలని, చెట్ల కింద అస్సలు ఉండొద్దని సూచించింది. చెట్ల కింద ఉండే పిడుగుపాటుకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రైతులు ఈ భారీ వర్షం తగ్గే వరకూ పనులను వాయిదా వేసుకోవాలని సూచించింది. చెరువులు, కుంటలు, నాలాలు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని నిర్దేశించింది.
Telangana Weather: తెలంగాణలో ఇలా
తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ నెల 25 వరకు మిగతా చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని చెప్పారు. ఈ 13 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు.
నేడు ఉదయం (22 జూన్ ఉదయం 5 గంటలకు) ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. రాబోయే 3 గంటల్లో సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ట్వీట్ చేశారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -