Telangana Government First Agreement In Davos Tour: పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు (Sreedhar Babu) దావోస్ పర్యటన సాగుతోంది. ఈ సందర్భంగా తొలి ఒప్పందం ఖరారైంది. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్లలో ఒకటైన యూనిలీవర్ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు కంపెనీ గ్లోబల్ సీఈవోతో సీఎం రేవంత్ జరిపిన చర్చలు విజయవంతం అయ్యాయి. రాష్ట్రంలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సంస్థ అంగీకరించింది. అలాగే, బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
అటు, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన మొదటి సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి డి.శ్రీధర్ బాబు ఎజిలిటీ సంస్థ ఛైర్మన్ తారెక్ సుల్తాన్‌ను కలిశారు. ఎజిలిటీ సంస్థ ప్రపంచంలో పేరొందిన లాజిస్టిక్స్ కంపెనీల్లో ఒకటి. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటంతో పాటు రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచేందుకు ఇస్తున్న ప్రాధాన్యతలను మంత్రి ఆయనతో పంచుకున్నారు. ఈ మేరకు ఆయా రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.
గ్రాండ్ ఇండియా పెవిలియన్
కాగా, ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేలా ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్(Grand Indian Pavilion)ను మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జయంత్ చౌధరి, చిరాగ్ పాస్వాన్‌తో పాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఆసక్తి కలిగిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఈ పెవిలియన్ పనిచేయనుంది.
అటు, సీఐఐ (CII) సారథ్యంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఐటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి బృందం ప్రయత్నాలు చేస్తోంది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంటోంది. రాష్ట్రంలో ఉన్న అనుకూలతలు, ప్రభుత్వ సాయం, రాయితీలపై బేరీజు వేసుకుని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. అలా ముందుకు వచ్చిన ఆయా సంస్థలతో సీఎం బృందం చర్చలు జరుపుతోంది. ఇంధన ఉత్పత్తితో పాటు హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న ఫోర్త్‌సిటి, ఏఐ ఆధారిత ఐటీ సేవల విస్తరణపై వివిధ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అత్యాధునిక డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టేందుకు సంప్రదింపులు జరుపుతున్నాయి.