Breaking News Live Telugu Updates: అమరావతి పాదయాత్రలో గందరగోళం- స్థానికుల జోక్యంతో ఉద్రిక్తత

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 14 Sep 2022 05:00 PM
అమరావతి పాదయాత్రలో గందరగోళం- స్థానికుల జోక్యంతో ఉద్రిక్తత

తెనాలి చేరుకున్న అమరావతి పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐతానగర్ వైపు పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు యాత్రను అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాలు మేరకు యాత్ర చేస్తామని రైతులు సమాధానం చెప్పారు. అయినా పాదయాత్రను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టారు పోలీసులు. స్థానిక ప్రజలు అమరావతి రైతులకు మద్దతుగా రోడ్లపైకి వచ్చి పోలీసులు పెట్టిన బారికేడ్లు పక్కకు తీసేశారు. దీంతో పోలీసులు, ప్రజల మధ్య కాసేపు తోపులాట జరిగింది. ఈ పెనుగులాటలో పలువురు కిందపడిపోయారు.

Hyderabad: స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు గవర్నర్ సత్కారం

హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను గవర్నర్ తమిళిసై సత్కరించారు. ఈ రోజు నిజాం రూల్ నుంచి హైదరాబాద్ విమోచన పొందిన దినోత్సవం జరుపుకుంటున్నాం. సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమొచన దినం. అందరూ స్వాతంత్ర సమరయోధులు త్యాగాన్ని గుర్తుకు పెట్టుకోవాలి. వరంగల్ పరకాలలో 35  మందిని  క్యూలో నిలబెట్టి నిజాం రాజులు ఒకేసారి తుపాకీతో కాల్చి చంపడం అమానుషం. ఫోటో ఎగ్జిబిషన్ లో నిజాం పరిపాలనలో  తెలంగాణ ఎదుర్కొన్న బాధలు, స్వాతంత్ర సమరయోధుల కృషి కనిపిస్తుంది’’ అని ఈ సందర్భంగా తమిళిసై అన్నారు.

Hyderabad News: హైదరాబాద్ ఈడీ కస్టడీలో అశీష్ మాలిక్

  • హైదరాబాద్ ఈడీ కస్టడీలో అశీష్ మాలిక్ ను విచారిస్తున్న అధికారులు

  • రష్యా రోసెనెఫ్ట్ హెడ్జ్ ఫండ్స్ కేసులో ఈడీ కస్టడీకి అశీష్ మాలిక్

  • దేశవ్యాప్తంగా వెయ్యిమంది వద్ద భారీగా వసూలు

  • హైదరాబాద్ లో సైతం బాధితులు

  • ఆయిల్ కంపెనీలో పెట్టుబడుల పేరుతో భారీగా వసూళ్లు

  • క్రిప్టో, బెట్ కయిన్ రూపంలో 52 కోట్లు దేశం దాటించిన నిందితుడు

  • అశీష్ మాలిక్ ను మే 30 లో అరెస్ట్ చేసిన ఢిల్లీ ఎకనామిక్ అఫెన్స్ వింగ్

  • సునీల్ సింగ్, సందీప్ కౌశిక్ తో కలిసి పెట్టుబడుల పేరుతో వసూళ్లు

  • విదేశాలకు ఇంకా ఎంతమొత్తంలో తరలించారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ

  • తీహార్ జైల్ నుండి హైదరాబాద్ తరలింపు 

  • మనీలాండరింగ్ పై విచారించనున్న ఈడీ అధికారులు

Medical Student Delivery: అనకాపల్లిలో రైల్లో పురుడు పోసిన వైద్య విద్యార్థిని

సికింద్రాబాద్ - విశాఖ దురంతో ట్రైన్ లో నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని పురుడు పోసి అందరి మన్ననలు పొందింది. శ్రీకాకుళానికి చెందిన గర్భిణికి అనకాపల్లి సమీపంలో నొప్పులు మొదలయ్యాయి. వెంటనే అదే బోగీలో ప్రయాణిస్తున్న వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థిని ట్రైన్ లో డెలివరీ చేసింది. ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు మెడిసిన్ చదువుతున్న విద్యార్థినికి ధన్యవాదాలు తెలిపారు. ఈ రైలు ప్రయాణంలో తమ తల్లి బిడ్డలను కాపాడిన ఆ విద్యార్థినిని అందరూ అభినందించారు.

Telangana News: బార్ల లైసెన్స్ పునరుద్ధరణకు నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్రంలో బార్ల లైసెన్స్‌ల పునరుద్ధరణకు ఆబ్కారీశాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2021-22 సంవత్సరానికి సంబంధించిన బార్ల లైసెన్స్‌ గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అక్టోబరు 1 నుంచి ఏడాది కాలానికి లైసెన్స్‌ను నిర్వహకులు పునరుద్ధరించుకోవాల్సి ఉంది. తెలంగాణ గ్రీన్‌ఫండ్‌ కింద రూ.వెయ్యి చొప్పున బార్ల నిర్వాహకులు చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Ruby Lodge Fire Accident: రూబీ లాడ్జి అగ్నిప్రమాద ఘటనలో నిందితుల ఆచూకీ గుర్తింపు, నలుగురి అరెస్టు

రూబీ హోటల్ ఫైర్ యాక్సిడెంట్ కేసులో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రంజిత్ సింగ్ బగ్గా, సుమిత్ సింగ్ బగ్గా తో పాటు సుదర్శన్ నాయుడు అనే మేనేజర్ తో పాటు, సూపర్ వైజర్ ను అరెస్ట్ చేశారు. మేడ్చల్ ఫాం హౌస్ లో తలదాచుకున్న తండ్రి కొడుకులు రంజిత్ సింగ్ బగ్గా, సుమిత్ సింగ్ బగ్గా అరెస్ట్ అయ్యారు.

Background

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఏపీ, తెలంగాణపై తగ్గింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ దానిని అనుకున్న ఆగ్నేయ మధ్యప్రదేశ్, విదర్భలపై నెలకొన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్ వైపు కదులుతూ చివరికి వాయువ్య మధ్యప్రదేశ్ కు చేరుకుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణలలో వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తక్కువ వర్షపాతం ఉండటంతో ఎలాంటి వర్షాల హెచ్చరికలు జారీ చేయలేదు వాతావరణ కేంద్రం.


తెలంగాణలో వర్షాలు 
అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై క్రమంగా తగ్గుతోంది. నేడు కొన్ని జిల్లాల్లోనే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఎలాంటి వర్షాల హెచ్చరికలు జారీ కాలేదు. 
నేడు ఉత్తర తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్ ను మేఘాలు కమ్మేస్తాయి. నగరంలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 22, గరిష్ట ఉష్ణోగ్రత 30గా నమోదైంది. నైరుతి దిశ నుంగి గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.  


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మరో రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయి. విశాఖ నగరంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు ఆకాశం మేఘావృతమై ఉండనుంది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం ఏపీపై క్రమంగా తగ్గుతోంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కానుంది.  మరో రెండు రోజులపాటు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాత్రి సమయంలో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్.టీ.ఆర్., కృష్ణా అక్కడక్కడా చిరుజల్లులు పడతాయి. రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదు కానుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో కొన్నిచోట్ల దారి లేక రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.


తెలంగాణలో బంగారం ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ ₹ 46,730 కి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ₹ 50,980 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 62,400 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు ₹ 46,730 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 50,980 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 62,400 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో.. 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్లు, కిలో వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.