Breaking News Live Updates: మంత్రి మల్లారెడ్డి వాహనంపై రాళ్ల దాడి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 29 May 2022 09:23 PM
మంత్రి మల్లారెడ్డి వాహనంపై రాళ్ల దాడి

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో జరిగిన రెడ్ల గర్జనలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్లారెడ్డి మాట్లాడుతున్నప్పుడు కొందరు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు వాహన శ్రేణిపై రాళ్లు , కుర్చీలు విసిరారు కొందరు. 

ప్రత్తిపాడు మండలంలో పెద్దపులి సంచారం, పశువులపై దాడి 

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. పోతులూరు వద్ద స్థానిక సర్పంచ్ లతో ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారు. రాత్రిపూట పశువులపై దాడి చేస్తున్నట్టు గుర్తించారు. పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చీఫ్ అటవీ అధికారి శరవనన్ ఆధ్వర్యంలో అటవీ అధికారుల నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నారు. పులిని బంధించేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. ఒమ్మంగి, పోతులూరు, పొదురుపాక, శరభవరం, ధర్మవరం గ్రామాల్లో పెద్దపులి గేదెలపై దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. 


 

BJP Rajyasabha : రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ 

బీజేపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్ , మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్ కు స్థానం కల్పించింది. అలాగే  ఉత్తరాఖండ్ నుంచి కల్పనా సైనీకి చోటు లభించింది. మొత్తం 16 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.  

Punjab Singer Murder : పంజాబీ సింగర్ సిద్ధూ దారుణ హత్య

Punjab Singer Murder : పంజాబ్ లో దారుణ ఘటన జరిగింది. పంజాబీ సింగర్ , కాంగ్రెస్ నేత సిద్ధూ హత్యకు గురయ్యారు. జీపులో వెళ్తుండగా సింగర్ సిద్ధూపై దుండగులు కాల్పులు జరిపారు.  సిద్ధూపై 20 రౌండ్ల కాల్పులు జరిపారు. పంజాబ్ మాన్సా జిల్లాలో ఘటన జరిగింది. 

MP TG Venkatesh: ఏపీ జెమ్స్, జ్యువెలరీ సంస్థ కేసులో ఎంపీ టీజీ వెంకటేశ్ కు క్లిన్ చిట్

* ఏపీ జెమ్స్, జ్యువెలరీ సంస్థ కేసులో ఎంపీ టీజీ వెంకటేశ్ కు క్లిన్ చిట్


* ఏ 5 నిందితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ పేరును FIR నుండి తొలగించిన
బంజారాహిల్స్ పోలీసులు 


* బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఏపీ జెమ్స్ జ్యువెలర్స్ కు చెందిన స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించారని కేసు 


* ఇప్పటికే నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు 


* ఈ కేసులో టీజీ వెంకటేష్ ప్రమేయంపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో FIR నుండి తొలగింపు  


* తనపై హత్యాయత్నం చేశారని సెక్యూరిటీ గార్డ్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్,  రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ నిందితుడిగా ఎఫ్.ఐ.ఆర్.లో నమోదు 


* బంజారాహిల్స్ పోలీసులు టీజీ వెంకటేష్ కు ఈ కేసుతో సంబంధం లేదంటూ స్పష్టం 


* ఏ-1 టీజీ విశ్వప్రసాద్ కు సీఆర్పే 41సీ కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు

TTD Updates: తిరుమల ఆలయ మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు జూన్ 5 నుండి 9వ తేదీ వ‌రకు

అమ‌రావ‌తిలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు జూన్ 5 నుండి 9వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి. జూన్ 9వ తేదీన‌ ఉద‌యం 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు విగ్ర‌హ‌ప్ర‌తిష్ట‌, మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి కరకట్ట పై భారీ అగ్నిప్రమాదం

గుంటూరు జిల్లా తాడేపల్లి కరకట్ట పై భారీ అగ్నిప్రమాదం


అమరావతి ఉండవల్లి కరకట్ట ప్రక్కన పంట అయిపోయిన అరటి తోటకు నిప్పు పెట్టడం తో చలరేగిన మంటలు


కరకట్ట కు ఇరు వైపుల భారీగా వ్యాపించిన మంటలు


సకాలంలో స్పందంచి ఫైర్ ఇంజన్ తెప్పించిన తాడేపల్లి పట్టణ సీఐ సాంబశివరావు


మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది


ప్రక్కనే ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం కు ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు


 సకాలంలో స్పందించి  మంటలను ఆర్పి తమ పంటల కి ఎలాంటి నష్టం కలగకుండా  చూసిన తాడేపల్లి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన ఉండవల్లి పెనుమాక రైతులు

Nepal Flight Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్, లోపల 22 మంది ప్రయాణికులు - నలుగురు ఇండియన్స్ కూడా

నేపాల్‌లో ఓ ప్రయాణికుల విమానం ఆచూకీ లేకుండా పోయింది. జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన తారా ఎయిర్ విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో సంబంధం  కోల్పోయింది. ఈ విమానంలో సిబ్బందితో సహా మొత్తం 22 మంది ఉన్నారు. ఈ విమానం పోఖారా నుంచి జోమ్‌సోమ్‌కు వెళ్తోంది. నేపాలీ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విమానం ఈరోజు ఉదయం 9:55 గంటలకు పోఖారా నుండి బయలుదేరింది. 10:20కి జోమ్ సోమ్‌లో దిగాల్సి ఉంది. అయితే 11 గంటల నుంచి ఈ విమానంతో ఏటీసీకి ఎలాంటి సంబంధాలు లేవు. ఇది ట్విన్ ఇంజన్ విమానం అని విమానాశ్రయ అధికారులు చెప్పారు.


నేపాల్‌లో ఓ ప్రభుత్వ టీవీ ఛానెల్ ప్రసారం చేసిన వివరాల ప్రకారం, అదృశ్యమైన విమానంలో నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్ జాతీయులు ఉన్నారు. మిగిలిన వారు నేపాల్‌కు చెందిన వారు ఉన్నారు. విమానంలో సిబ్బందితో సహా 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. తారా ఎయిర్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా నేపాల్‌లోని మీడియా సంస్థ కాంతిపూర్‌తో మాట్లాడుతూ కెప్టెన్ ప్రభాకర్ ప్రసాద్ ఘిమిరే, కో-పైలట్ ఉత్సవ్ పోఖారెల్, ఎయిర్ హోస్టెస్ కిస్మి థాపా విమానంలో ఉన్నారని చెప్పారు.

Prakasam News: రిపోర్టర్ కిడ్నాప్, హత్యాయత్నం - నిందితుల్ని పట్టుకున్న పోలీసులు

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల కేంద్రానికి చెందిన సుధాకర్ (37) అనే వ్యక్తిని ఒంగోలులో కిడ్నాప్ చేసి చెరుకుపల్లి గ్రామ శివారులోని రూములో కొంత మంది ఆగంతకులు బంధించారు. బాధితుడు సుధాకర్ ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు చెందిన ఓ టీవీ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. నిన్న సాయంత్రం రూములో నుంచి తప్పించుకొని బాధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం ఆరుగురు వ్యక్తులపై కిడ్నాప్, హత్యాయత్న కేసు నమోదుచేశారు.

MMTS Trains Cancel: హైదరాబాద్‌లో 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

హైదరాబాద్ లో ఆదివారం 34 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేశారు. ఆ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ అదనపు బస్సులను నడుపుతుందని గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ యాదగిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, కారణాలు మాత్రం వెల్లడించలేదు. లింగంపల్లి - హైదరాబాద్‌ (9 రైలు సర్వీసులు), ఫలక్‌నుమా - లింగంపల్లి (7 రైలు సర్వీసులు), సికింద్రాబాద్‌ - లింగంపల్లి (ఒక రైలు సర్వీసు) ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులు రద్దు చేశారు. దీంతో 9 వైఎఫ్‌ రూట్‌లో కేశవగిరి - బోరబండకు 22 బస్సులు, 10హెచ్‌ (సికింద్రాబాద్‌-హైటెక్‌సిటీ) 54 బస్సులు, 10వైఎఫ్‌ (సికింద్రాబాద్‌-బోరబండ) 16 బస్సులు, 218 (సీబీఎస్‌, చాంద్రాయణగుట్ట-పటాన్‌చెరు) 108 బస్సులు, 219 (సికింద్రాబాద్‌ - పటాన్‌చెరు) రూట్లో 84 బస్సులను ఆర్టీసీ నడుపుతున్నారు.

Background

పశ్చిమ దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల వల్ల కోస్తాంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికం కానున్నాయి. అత్యధికంగా రాజమండ్రి నగరంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యింది. రాజమండ్రితో పాటు గుంటూరు, విజయవాడ​, తుని, తాడేపల్లిగూడెం, బందరు, బాపట్ల​, కాకినాడల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 మధ్యలో నమోదయ్యాయి. హైదరాబాద్ లోనూ ఉష్ణోగ్రత మరింత పెరిగింది. ముఖ్యంగా బేగంపేట్ లో 39.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. నేడు 40 డిగ్రీలకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.


నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించినా, ఏపీ, తెలంగాణలో రాక ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం రాయలసీమ దాని పరిసర సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉంది. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి 5 డిగ్రీల ఉత్తర అక్షాంశం / 67 డిగ్రీల తూర్పు రేఖాంశం, 6 డిగ్రీల ఉత్తర అక్షాంశం లేదా 72 డిగ్రీల తూర్పు రేఖాంశం, 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 94.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఏపీ, యానాం, తెలంగాణలో పలుచోట్ల నేడు సైతం మోస్తరు వర్షాలు కురయనున్నాయని వెల్లడించారు.


ఉత్తరకోస్తాంధ్ర, యానాంలలో..
ఈ రోజు కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల మాత్రమే మనం వర్షాలను చూడొచ్చు. అంతేగానీ ఎక్కడా భారీ వర్షాలు, విస్తారమైన వర్షాలుండవు. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వ్యాపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో ప్రస్తుతం పడమర, వాయువ్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. బంగాళాఖాతం ప్రభావంతో మేఘాలు ఏర్పడి ఏపీ మేఘావృతమై ఉంటుంది. పలు చోట్ల 44, 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడతాయి. రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. 3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గుంటూరు, కృష్ణా, విజయవాడ​, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


తెలంగాణలో పొడి వాతావరణం..
తెలంగాణలో నేడు సైతం కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లోనూ ఈరోజు ఎక్కడ వర్షాలుండవు. బాగా వేడిగా ఉండనుంది. మరో వైపున తేమ అధికంగా ఉండటంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడతారు. రుతుపవనాలు కేరళ దక్షిణ భాగం దగ్గర చాలా బలహీనంగా కనిపిస్తోంది. దీని వల్ల రుతుపవనాలు కాస్తంతా ఆలస్యం అవ్వనుంది. కానీ జూన్ రెండో వారంలో తెలుగు రాష్ట్రాలను తాకే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి 10 నుంచి 20 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది కానీ వర్షం పడే అవకాశం లేదు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.