Pushpa 2 Box Office Collection: ‘పుష్ప.. పుష్పరాజ్ నీయవ్వ తగ్గేదేలే’ అనే డైలాగ్‌ని ‘పుష్ప’ సినిమా కోసం ఏ క్షణాన రాశారో తెలియదు కానీ.. ఆ డైలాగ్‌ని అక్షరాలా పాటిస్తున్నాయి ఆ సినిమా కలెక్షన్స్. అవును.. ఒక రికార్డు ప్రకటించే లోపే మరొ కొత్త రికార్డు అన్నట్లుగా ‘పుష్ప-2’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ‘పుష్ప 2 ది రూల్’ సినిమా విడుదలై మూడు వారాలు పూర్తయ్యాయి. మూడు వారాల తర్వాత కూడా రికార్డ్ అంటే.. ‘పుష్ప’గాడి ప్రభంజనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ‘పుష్ప రాజ్’ ఇప్పుడేం రికార్డ్ కొట్టాడని అనుకుంటున్నారా?  తాజాగా మేకర్స్ ఈ మూవీ మూడు వారాల కలెక్షన్స్ అంటూ ఓ పోస్టర్ వదిలింది. ఈ పోస్టర్‌పై ఉన్న ఫిగర్ చూస్తే.. యావత్‌ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన ప్రేక్షకులంతా సంభ్రమాశ్చర్యాలకు గురికాక తప్పదు. అలాంటి ఫిగర్ అది. 


అలా ఊరించడమెందుకు.. ఆ ఫిగర్ చెప్పేయవచ్చుగా అంటారా. అయితే రెడీ.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 1705 (21 రోజులకు) కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్లుగా అధికారికంగా మేకర్స్ పోస్టర్ వదిలారు. అర్థమైందిగా.. 21 రోజుల్లో రూ.1705 ప్లస్ కోట్లు సాధించిన తొలి చిత్రంగా ‘పుష్ప 2 ది రూల్’ సినిమా సరికొత్త రికార్డ్‌ను లిఖించింది. డిసెంబర్ 4న మొదలైన ‘పుష్ప 2’ చిత్ర రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉందనేది ఈ కలెక్షన్లు తెలియజేస్తున్నాయి. మరీ ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఈ సినిమా రప్పా రప్పా అనేలా ఇంకా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్‌ని రాబడుతూనే ఉంది. ఇప్పటికే వందేళ్ల బాలీవుడ్ సినీ చరిత్రను తిరగరాసిన ‘పుష్ప 2’.. ఇంకా ఆశ్చర్యపరిచేలా కలెక్షన్స్‌ని రాబడుతుండటం చూస్తుంటే.. దీనికి బ్రేక్ ఎప్పుడు, ఎక్కడ అనేది అర్థం కాకుండా ఉంది. బహుశా సంక్రాంతి వరకు పుష్పగాడి హవాకు ఎదురే లేదని చెప్పుకోవచ్చు. నిజంగా అదే జరిగితే మాత్రం.. బాలీవుడ్‌లో పుష్పగాడి జెండా పాతినట్టే, బాలీవుడ్ హీరోలకు సరికొత్త టార్గెట్ నిర్దేశించినట్టే. 


Also Readబేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా - దళపతి విజయ్ 'తెరి' బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?


బాలీవుడ్ సంగతి అలా ఉంటే.. నేపాల్‌లోనూ ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుండటం విశేషం. కేవలం రూ. 20 రోజుల్లో రూ. 24.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ‘హయ్యస్ట్ గ్రాసింగ్ ఫారెన్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ నేపాల్’ రికార్డును సాధించింది ‘పుష్ప 2’. ఈ సినిమాపై కొందరు నెగిటివ్ ప్రచారం చేసినా.. సౌత్‌లోనూ ‘పుష్ప 2’ని సరికొత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశాడు పుష్పరాజ్. 






మొత్తంగా అయితే.. కొన్ని రోజులుగా ‘పుష్ప’గాడి హవాకు బ్రేకే లేదు అన్నట్లుగా బాక్సాఫీస్ వద్ద ‘పుష్పరాజ్’ తాండవమాడేస్తున్నాడు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘పుష్ప 2 ది రూల్’ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించగా.. రావు రమేష్, ఫహాద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ వంటి వారంతా ఇతర పాత్రలలో నటించారు. సుకుమార్‌ రైటింగ్‌ సంస్థతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


Also Read: 'మ్యాక్స్' రివ్యూ: మ్యాగ్జిమమ్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన కిచ్చా సుదీప్ - మరి సినిమా హిట్టా? ఫట్టా?