Manmohan Singh Death:మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. "గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరు, నాయకులు, సంస్కర్త, అన్నింటికంటే మించి మన కాలంలోని మానవతావాది మన్మోహన్ సింగ్ జీ ఇక లేరు. సద్గుణం, నిష్కళంకమైన సమగ్రత, నిర్ణయం తీసుకోవడంలో అన్నింటికంటే మానవీయతో చూసే వ్యక్తి. డాక్టర్ సింగ్ న్యూ ఇండియాకు నిజమైన వాస్తుశిల్పుల్లో ఒకరు. రాజకీయ & ప్రజా జీవితానికి మర్యాద ఎంత అవసరమో చూపించారు. ఆయన ఒక లెజెండ్, ఆయన మరణం భారతదేశం ఒక గొప్ప కుమారుడిని కోల్పోయింది." అని అన్నారు.
మాజీ ప్రధాన మంత్రి, ప్రఖ్యాత ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ జీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. "మేధావి రాజనీతిజ్ఞుడు, వినయం, జ్ఞానం, కలగలిపిన వ్యక్తి. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల నుంచి ప్రధానమంత్రిగా ఆయన నాయకత్వం వరకు దేశానికి అవిశ్రాంతంగా సేవలందించి లక్షలాది మందిని ఉద్ధరించారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి, ఆత్మీయులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి." అని పోస్టు పెట్టారు.
దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత: పవన్ కల్యాణ్
"భారత దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. భారత దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యుల్లో ఒకరు మన్మోహన్ సింగ్. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, యూజీసీ ఛైర్మన్ గా విశిష్ట సేవలందించిన ఆయన ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. శ్రీ మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన సంస్కరణల వల్ల ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కింది. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. మన్మోహన్ సింగ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను." అని ఓప్రకటన విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
కిషన్ రెడ్డి సంతాప సందేశం
"భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మన్మోహన్ ఢిల్లీ ఏయియ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని తెలిసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, ప్రణాళికా సంఘంలో కీలక బాధ్యతల్లో, యూజీసీ చైర్మన్ గా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వారు దేశానికి వన్నెతీసుకొచ్చారు.
పీవీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, దేశ ఆర్థిక మంత్రిగా.. దేశంలో సంస్కరణలు తీసుకురావడంలో వారు పోషించిన పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.
2019లో నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో వారు అప్పుడప్పుడూ పార్లమెంటు వీల్ చైర్‌లో రావడం గుర్తుంది. పార్లమెంటు సభ్యుడిగా వారి అంకితభావానికి ఇది నిదర్శనం. మేధావి, మితభాషి, సౌమ్యుడు, స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా.. మన్మోహన్ సింగ్ మన యువతరానికి ఆదర్శం. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. నిరాడంబర జీవితం, దేశం పట్ల వారి అంకిత భావం భావితరాలకు స్ఫూర్తి దాయకం." అని కిషన్ రెడ్డి సంతాపం సందేశం అందించారు.
మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంపట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివి అన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.
మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ మృతి పట్ల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆర్థికమంత్రిగా, ప్రధానిగా ఆయన చేసిన సేవలను ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదన్నారు. " ప్రధాని పి.వి సారథ్యంలో ఆర్థిక మంత్రిగా దేశానికి ఒక కొత్త దిశ వైపు నడిపించిన గొప్ప ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్. ప్రపంచీకరణతో భారత్ ను తిరుగులేని శక్తిగా మార్చిన ఘనత ఆయనది. ప్రధానిగా పదేళ్ల పాటు ఆయన తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు పేదల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచాయి. దేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత ఆయనది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. సహనశీలిగా, వివాదరహితుడిగా, నిత్యం చిరునవ్వుతో కనిపించేవాడు. డా. మన్మోహన్ సింగ్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిల్చిపోతారు. దేశం ఒక గొప్ప ఆర్థిక నిపుణుడిని కోల్పోయింది. వారి కుటుంబానికి నా ఆశ్రు నివాళి."
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సంతాపం తెలియజేశారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా, మాజీ ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు దేశం ఏ నాటికి మరిచిపోదు అన్నారు. ఆయన ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందిన్నారు. క్రమశిక్షణ కు మారు పేరు, నమ్మిన సిద్ధాంతం జీవితకాలం ఆచరించిన గొప్ప మనిషి మన్మోహన్ సింగ్ అని కితాబు ఇచ్చారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నర్సింహా. దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి మన్మోహన్ సింగ్ అని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థికమంత్రిగా తర్వాత దేశ ప్రధానిగా ఆయన చేసిన సేవలు ఈ దేశం ఎన్నటికి మరిచిపోదన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 15 వ లోక్ సభలో ఆయన ప్రధానిగా తాను ఎంపీగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు భారత ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుకోవడానికి ఆయన ఎన్నో సంస్కరణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Also Read: నేనో గురువు, గైడ్‌ని కోల్పోయాను- మన్మోహన్ సింగ్ మృతిపై రాహుల్ గాంధీ ఉద్వేగం