Breaking News Live: ఏపీ శాసన మండలి ఛైర్మన్ కు నోటిఫికేషన్ విడుదల.. నామినేషన్ దాఖలు చేసిన మోషేన్ రాజు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 18 Nov 2021 08:39 PM
ఏపీ శాసన మండలి ఛైర్మన్ కు నోటిఫికేషన్ విడుదల.. నామినేషన్ దాఖలు చేసిన మోషేన్ రాజు

ఏపీ శాసన మండలి ఛైర్మన్ ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. వైసీపీ తరఫున ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌ రాజు మండలి ఛైర్మన్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి పి. బాలకృష్ణమాచార్యులకు ఆయన నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఎమ్మెల్సీలు దువ్వాడా శ్రీనివాస్, బల్లి చక్రవర్తి, ప్రభాకర్ రెడ్డి ఆయన పేరును ప్రతిపాదించారు. శుక్రవారం(నవంబర్ 19న) మండలి ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.

చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి

జనగామ జిల్లాలో తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడి మృతి చెందాడు. చెట్టు ఎక్కేందుకు వినియోగించే తాడు తెగిపోవడంతో గీత కార్మికుడు బైరగొని శ్రీనివాస్ కిందపడిపోయాడు. 30 అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు. నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన  బైరగొని శ్రీనివాస్( 28)  రోజు వారీగా కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కేందుకు వినియోగించే తాడు తెగిపోవడంతో ఒక్క సరిగా కింద పడ్డాడు. యువకుడైన శ్రీనివాస్ చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

అంబులెన్స్ సేవలు ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్ కోఠి, డీఎంఈ క్యాంపస్ లో అంబులెన్స్ సేవలను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం ప్రారంభించారు. దాదాపు 1.41 కోట్లతో  ఏడు అంబులెన్స్ సేవలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. 4 అంబులెన్స్ లో లైఫ్ సపోర్ట్ అందుబాటులో ఉందన్నారు. బోధనస్పత్రుల్లో ఈ వాహనాలు వినియోస్తారని పేర్కొన్నారు.  కరోనా లాంటి పరిస్థితుల్లో అంబులెన్స్ అందుబాటులోకి తీసుకురావడం సంతోషమన్నారు. అంబులెన్స్ లను ఇచ్చిన హ్యుందాయ్ సంస్థను అభినందిస్తున్నారు. రాష్ట్రంలో 108 వాహనాలు  429 ఉన్నాయని గుర్తుచేశారు. మరింత మెరుగ్గా 108 సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాత వాహనాలు తొలగించి అవసరం అయిన చోట కొత్త వాహనాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. హైదరాబాద్లో నాలుగు ఆసుపత్రుల సిద్ధం చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. 

గవర్నర్ బిశ్వభూషణ్ కు సీఎం జగన్ ఫోన్... ఆరోగ్య పరిస్థితిపై ఆరా

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను సీఎం జగన్ ఫోన్‌లో పరామర్శించారు. శాసనసభ విరామ సమయంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం.. బిశ్వభూషణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బుధవారం వైద్యులతో ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడినట్లు తెలిపారు. సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారని గవర్నర్‌కు ముఖ్యమంత్రి వెల్లడించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వివరించారు. 

వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత

వరి ధాన్యం కొనుగోలు విషయంపై రాష్ట్రంలో నిరసనల పర్వం కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని స్పష్టం చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటికే 60 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని, గతంలో మరో 44.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామని వివరించింది. గతంలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసినప్పటికీ, ఇకపై అది కుదరదని చెప్పాం. అందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరించింది. పంజాబ్‌లో వరి వినియోగం అంతగా ఉండదని అందుకే 90 శాతం ధాన్యం సేకరిస్తున్నామని స్పష్టం చేసింది. దేశ అవసరాలకు మించి వరి, గోధుమ సాగు అవుతోందని కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పంట మార్పిడి అనివార్యంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది.

ముగిసిన టీఆర్ఎస్ మహా ధర్నా

వరి పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద చేపట్టిన మహా ధర్నా ముగిసింది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్‌కు టీఆర్ఎస్ నేతలు అందరితో కలిసి వెళ్లారు. గవర్నర్ తమిళిసైని కలిసి కేంద్ర ప్రభుత్వ తీరుపై మెమోరండం అందించనున్నారు. 

పాదయాత్రగా రాజ్ భవన్‌కు వెళ్లనున్న కేసీఆర్

హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద చేపట్టిన ఈ ధర్నా కొనసాగుతోంది. సీఎం కేసీఆర్‌తో సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ ధర్నా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. మహా ధర్నా తర్వాత కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి సీఎం కేసీఆర్‌ వినతి పత్రం ఇవ్వనున్నారు. ఇందుకోసం కేసీఆర్ రాజ్‌ భవన్‌కు పాదయాత్రగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇది ప్రారంభం మాత్రమే: కేసీఆర్

టీఆర్ఎస్ మహా ధర్నాకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘రైతుల కోసం కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న ఈ పోరాటం చేస్తున్నాం. ఇది ఇప్పటితో ఆగదు. ఈ పోరాటం ప్రారంభం మాత్రమే. గ్రామాల్లోనూ ఈ పోరాట వ్యూహాలను అమలు చేస్తాం. భవిష్యత్తులో కూడా ఈ పోరాటం సాగుతుంది. అవసరమైతే ఉత్తరాదిలో రైతులు చేస్తున్న నిరసనలను కలుపుకొని పోతాం. గతంలో మన వ్యవసాయ మంత్రి రైతుల సమస్యలపై ఎన్నోసార్లు కేంద్రమంత్రిని కలిసి విన్నవించారు. నిన్న నేను కూడా ప్రధాని లేఖ రాశా. కానీ, ఇంత వరకూ ఎలాంటి సమాధానం లేదు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకూ మన నిరసన కొనసాగుతుంది’’ అని కేసీఆర్ మాట్లాడారు.

టీఆర్ఎస్ ధర్నా ప్రారంభం

హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద టీఆర్ఎస్ మహా ధర్నా ప్రారంభమైంది. కొద్ది సేపటి క్రితమే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా కీలక టీఆర్ఎస్ నేతలు ధర్నా వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ వేదికపై వరి కంకులను ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం వరి పంటను తెలంగాణ నుంచి కొనాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా తలపెట్టిన సంగతి తెలిసిందే.

అనంతపురం: కదిరి మండలం పట్నం గ్రామంలో మహిళ దారుణ హత్య..

కదిరి మండలం పట్నం గ్రామం నుండి కదిరిటౌన్ కు ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్న శివ శంకర్ నిన్న రాత్రి భార్య హేమలతను రొకలితో తలపై కొట్టి హత్య చేశాడు. అయితే, హేమలతకు అదే గ్రామానికి చెందిన రామాంజనేయులుతో వివాహేతర సంబంధం ఉండడం వల్ల భర్త ఇలా చేశాడని స్థానికులు చెప్పారు. శివ శంకర్ భార్య రామాంజనేయులుతో ఇంట్లో ఉండడాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త శివశంకర్.. ఆమెను హత్య చేసినట్లుగా చెప్పి పోలీసులకు లొంగిపోయాడు.

Background

తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాలనే డిమాండ్‌తో గురువారం తెలంగాణ కాంగ్రెస్ నిరసనలు చేపట్టనుంది. హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌ నుంచి వ్యవసాయశాఖ కమిషనరేట్‌ వరకు కాంగ్రెస్‌ పార్టీ నిరసన ప్రదర్శనను నిర్వహించనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరుగుతాయి. ఈ ప్రదర్శనలో పెద్ద ఎత్తున రైతులు కూడా పాల్గొంటారు. వ్యవసాయశాఖ కమిషనరేట్‌ వరకు ప్రదర్శన అనంతరం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని వినతి పత్రం సమర్పిస్తారు.


మానవత్వాన్ని చాటుకున్న కేటీఆర్
మంత్రి కేటీఆర్ మరోసారి తనలోని మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని తన ఎస్కార్ట్‌ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి మియాపూర్‌కు చెందిన పవన్‌, నగేష్‌ శామీర్‌పేట నుంచి మియాపూర్‌ వైపునకు వెళ్తుండగా, హకీంపేట నిషా వద్ద బైక్‌ నుంచి జారి కిందపడ్డారు. అదే మార్గం గుండా వెళ్తున్న మంత్రి కేటీఆర్‌ గమనించి తన కాన్వాయ్‌ను పక్కకు నిలిపారు. వారిని తన ఎస్కార్ట్‌లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.


నేటి ఇంధన ధరలు ఇవీ..
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర రూ.0.27 పైసలు తగ్గింది. దీంతో తాజా ధర రూ.107.69 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.25 పైసలు తగ్గి రూ.94.14గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు స్వల్పంగా పెరిగింది. లీటరుకు రూ.0.28 పైసలు పెరిగి ప్రస్తుతం రూ.109.79 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.13 పైసలు పెరిగి రూ.96.44గా ఉంది. 


నేటి బంగారం ధరలు
హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,900 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.50,070 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.71,500గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,900 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,070గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,500గా ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,900 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,070గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.71,500 గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.