Rohi Vs Dhoni: భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. టీమిండియాను నాలుగు రకాల ఐసీసీ టోర్నీ ఫైనల్ కు చేర్చిన ఏకైక కెప్టెన్ గా ఘనత వహించాడు. 2022 ఫిబ్రవరిలో సారథిగా పగ్గాలు చేపట్టిన రోహిత్.. ఈ మూడేళ్లలో అనితర సాధ్యమైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా 2023 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు భారత్ ను చేర్చి, తొలి ఐసీసీ టోర్నీ ఫైనల్ ఘనతను సాధించాడు. అదే ఏడాది సొంతగడ్డపై జరిగిన 2023 వన్డే ప్రపంచకప్ లో అజేయంగా నిలిపి, ఫైనల్ కు చేర్చాడు. ఇక తర్వాత ఏడాది వెస్టిండీస్ లో జరిగిన టీ20 ప్రపంచకప్ లోనూ ఫైనల్లో స్థానం సంపాదించేలా పావులు కదిపాడు. తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్లతో ఓడించి, తన కెప్టెన్సీలో నాలుగో ఐసీసీ టైటిల్ పోరుకు భారత్ అర్హత సాధించేలా చేశాడు. అయితే ఇందులో టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో 209 పరుగులతో, వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆరు వికెట్లతో ఆసీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. అయితే టీ20 ప్రపంచప్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి 2007 తర్వాత టీమిండియా రెండోసారి టైటిల్ లిఫ్ట్ చేసేలా తన నాయకత్వ ప్రతిభ చాటాడు.
ధోనీ మాత్రమే..గతంలో మూడు ఐసీసీ టోర్నీ ఫైనల్స్ కు చేర్చిన రికార్డు ఎంఎస్ ధోనీ పేరిట ఉండేది. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ లలో భారత్ ను ఫైనల్ కు చేర్చాడు. అయితే అన్ని టోర్నీలలో భారత్ విజేతగా నిలిచింది. గతేడాదే ఈ ఫైనల్ చేరిక ఘనతను రోహిత్ సమం చేయగా, తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టి టీమిండియా తరపున మేటీ కెప్టెన్ గా ఎదిగాడు. ఇక ఆదివారం ఫైనల్ మ్యాచ్ ను దుబాయ్ వేదికగా భారత్ ఆడుతుంది. బుధవారం సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో సెమీస్ లాహోర్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్లో టీమిండియాతో తలపడుతుంది.
2011 తర్వాత నాకౌట్ లో ఆసీస్ పై గెలుపు.. మంగళవారం జరిగిన సెమీస్ మ్యాచ్ లో భారత్ కొన్ని ఘనతలు సాధించింది. తనకు కొరకరాని కొయ్యలా మారిన ఆసీస్ ను దాదాపు 14 ఏళ్ల తర్వాత నాకౌట్ లో మట్టి కరిపించింది. సొంతగడ్డపై 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఆసీస్ ను ఓడించింది. అప్పుడు 261 పరుగుల టార్గెట్ ను ఛేదించి, కంగారూలను ఇంటిముఖం పట్టించింది. ఆ మ్యాచ్ లో పూర్తి చేసిన 261 పరుగుల టార్గెటే ఆసీస్ పై భారత్ కు అత్యధిక ఛేదన కావడం విశేషం. తాజాగా దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో 265 పరగుల టార్గెట్ ను ఛేదించి, నాకౌట్ లో ఆసీస్ పై తన రికార్డును మెరుగు పర్చుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరగులకు ఆలౌటవగా.. మరో 11 బంతులు మిగిలి ఉండగానే 267-6 తో భారత్ విజయం సాధించింది. ఛేజ్ మాస్టర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (84) కీలక ఇన్నింగ్స్ తో ఛేజింగ్ లో తన ప్రతిభను మరోసారి చాటాడు.