ICC Champions Trophy 2025 Ind Vs Aus Result Update: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్.. ఫైనల్ కు దూసుకెళ్లింది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్.. అదే ఆటతీరుతో కంగారూలను ఇంటిముఖం పట్టించింది. మంగళవారం మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్లతో భారత్ ఘన విజయం సాధించింది. ఛేజ్ మాస్టర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (98 బంతుల్లో 84, 5 ఫోర్లు) భారీ అర్థ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ఈ మ్యాచ్ లో ఛేజింగ్ లో 8వేల పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (73) కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించాడు. వెటరన్ పేసర్ మహ్మద్ షమీ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఛేదనను భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లకు 267 పరుగులు చేసి పూర్తి చేసింది. కోహ్లీతోపాటు మిగతా బ్యాటర్లు కూడా తలో చేయి వేశారు. బుధవారం సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో ఫైనల్లో భారత్ తలపడుతుంది. ఫైనల్ కూడా ఇదే వేదికపై జరుగుతుంది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపాకు రెండు వికెట్లు దక్కాయి. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
మరోసారి విఫలమైన ఓపెనర్లు.. కీలకమైన ఛేజింగ్ లో భారత ఓపెనర్లు శుభమాన్ గిల్ (8), రోహిత్ శర్మ (28) మరోసారి విఫలమయ్యారు. ముఖ్యంగా నాకౌట్లో త్వరగా ఔటయ్యే బలహీనతను గిల్ మరోసారి బయటపెట్టుకున్నాడు. రోహిత్ ఉన్నంత సేపు సూపర్ టచ్ లో కన్పించగా, ఆ తర్వాత స్వీప్ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (45) తో కలిసి మ్యాచ్ టర్నింగ్ భాగస్వామ్యాన్ని కోహ్లీ నమోదు చేశాడు. చకచకా సింగిల్స్ తీస్తూ, స్ట్రైక్ రొటేట్ చేస్తూ కోహ్లీ బ్యాటింగ్ చేయగా, వేగంగా పరుగులు సాధిస్తూ శ్రేయస్ ప్రత్యర్థిపై ఒత్తిడి పెట్టాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు కీలకమైన 91 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో భారత ఇన్నింగ్స్ కుదుటపడింది. చివరకు జంపా బౌలింగ్ లో శ్రేయస్ ఔటవడంతో ఉత్కంఠ పెరిగింది.
'కుంగ్ ఫూ' పాండ్యా సిక్సర్లు..ఆ తర్వాత మిడిలార్డర్లో కీలక భాగస్వామ్యాలను కోహ్లీ నమోదు చేశాడు. అక్షర్ పటేల్ (27)తో 54 పరుగులు, కేఎల్ రాహుల్ (34 బంతుల్లో 42 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు)తో 47 పరుగులు జోడించడంతో జట్టు విజయం దిశగా వడివడిగా అడుగులు వేసింది. సెంచరీకి చేరువైన కోహ్లీ ఔటై నిరాశపర్చాడు. విజయానికి 50 పరుగులు కావాల్సిన దశలో కోహ్లీ అనవసర షాట్ కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఈ దశలో మ్యాచ్ చెరి సగం అన్నట్లుగా నిలిచింది. ఆరంభంలో ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 28, 1 ఫోర్, 3 సిక్సర్లు) బంతులు వేస్ట్ చేసినా, తర్వాత మూడు భారీ సిక్సర్లు బాది జట్టుపై ఒత్తిడినంతా తీసేశాడు. అభిమనులు ముద్దుగా కుంగ్ ఫూ పాండ్యా అని పిలుచుకునే ఈ స్టార్ ఆల్ రౌండర్ చివర్లో సిక్సర్లతో జోష్ పెంచాడు. దీంతో భారత్ విజయానికి చేరువలోకి వచ్చింది. అయితే ఈ దశలో మరో భారీ షాట్ తో మ్యాచ్ ను త్వరగా ముగిద్దామని భావించిన పాండ్యా ఔటయ్యాడు. ఆఖరికి రవీంద్ర జడేజా (2 నాటౌట్) తో కలిసి రాహుల్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. సిక్సర్ తో రాహుల్ మ్యాచ్ ను ముగించడం విశేషం. మిగతా బౌలర్లలో నాథన్ ఎల్లిస్ కు రెండు, కూపర్ కన్నోలీ, బెన్ డ్వార్షియస్ తలో వికెట్ సాధించాడు. ఈ విజయంతో 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇక మెగాటోర్నీ ఫైనల్ ఈనెల 9న (ఆదివారం) ఇదే వేదికపై జరుగుతుంది.