ICC Champions Trophy 2025 Live Updates: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న తొలి సెమీస్ లో ఆస్ట్రేలియా డీసెంట్ స్కోరు సాధించింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ (96 బంతుల్లో 73, 4 ఫోర్లు, 1 సిక్సర్)తో సత్తా చాటాడు. ఐసీసీ నాకౌట్ లో ఐదో ఫిఫ్టీ సాధించాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ కి 3 వికెట్లు దక్కాయి. నిజానికి ఒక దశలో స్కోరు 300 పరుగులు సాధిస్తుందని అనిపించింది. అయితే రెండో డ్రింక్స్ విరామం తర్వాత పుంజుకున్న భారత్.. వరుస విరామాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. అంతకుముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 14వ సారి టాస్ ఓడిపోయాడు. న్యూజిలాండ్ తో ఆడిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగింది. ఇక ఆసీస్ జట్టులోనూ రెండు మార్పులు జరిగాయి. గాయం కారణంగా ఓపెనర్ మథ్యూ షార్ట్, పేసర్ స్పెన్సర్ జాన్సన్లు ఈ మ్యాచ్ లో ఆడటం లేదు. వారి స్థానంలో కూపర్ కన్నోలీ, జాసన్ సంగాను తుదిజట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఈనెల 9న జరిగే ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.
హెడ్ దూకుడు..టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ కు ట్రావిస్ హెడ్ (33 బంతుల్లో 39, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుతో మంచి ఆరంభాన్నిచ్చాడు. మరో ఓపెనర్ కూపర్ డకౌటైనా, భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. వేగంగా పరుగులు సాధించాడు. ఫిఫ్టీ వైపు వెళుతున్న అతడిని వరుణ్ బంతితో బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత స్మిత్ ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచాడు. మార్నస్ లబుషేన్ (29), అలెక్స్ కేరీ (61) తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ముఖ్యంగా తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో స్మిత్ అలరించాడు. ఈ క్రమంలో 68 బంతుల్లో ఫిఫ్టీ చేసుకున్నాడు.
ఆ తర్వాత స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో షమీ అతడిని పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత కేరీ కీలక ఇన్నింగ్స్ తో జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. వేగంగా ఆడి 48 బంతుల్లోనే ఫిఫ్టీ చేశాడు. తను చివరి వరకు ఉంటే స్కోరు 280 దాటుతుందని అనిపించింది. అయితే ఇన్నింగ్స్ ఆఖర్లో శ్రేయస్ అయ్యర్ విసిరిన డైరెక్టు త్రోకు తను రనౌటయ్యాడు. చివర్లో టెయిలెండర్లు తలో చేయి వేయడంతో సవాలు విసరగలిగే స్కోరును ఆసీస్ సాధించింది. అయితే కివీస్ తో మ్యాచ్ కు ఉపయోగించిన పిచ్ కంటే ఈ పిచ్ బ్యాటింగ్ కు కొంచెం అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మిగతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజాకు రెండు, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది.
Read Also: Ravindra Jadeja Plaster: జడేజా చేతికి ప్లాస్టర్.. అంపైర్ కీలక నిర్ణయం.. షాక్ లో నెటిజన్లు