ICC Champions Trophy 2025 Latest Updates: ఆస్ట్రేలియాతో సెమీస్ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాస్ ఓడిపోవడమే మంచిదైందని వ్యాఖ్యానించాడు. దుబాయ్ లో మంగళవారం జరుగుతున్న ఈ మ్యాచ్ లో మళ్లీ టాస్ ఓడిపోయాడు. అతనిలా టాస్ ఓడిపోవడం వరుసగా 14వ సారి కావడం విశేషం. ఇక దుబాయ్ స్టేడియంలోని రకరకాల పిచ్ లపై ఇప్పటివరకు 3 లీగ్ మ్యాచ్ లను నిర్వహించారు. సెమీస్ కు కూడా కొత్త రకం పిచ్ ను రూపొందించారు. దీంతో సెమీస్ లో ముందు బ్యాటింగ్ చేయాలా..? లక బౌలింగ్ చేయాలా... అనేది నిర్ణయించుకోలేకపోయాయని, టాస్ ఓడిపోవడమే మంచిదైందని తెలిపాడు. ఇక ఈ స్టేడియంలో పిచ్ లు స్లో బౌలర్లను అనుకూలంగా ఉంటున్నాయి. ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలిస్తున్నాయి. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో తొమ్మిది వికెట్లను భారత స్పిన్నర్లే తీయడం విశేషం. ఇక ఈ మ్యాచ్ లోనూ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తాయన్న అంచనాలు ఉన్నాయి.
భారత్ గెలుస్తుంది..
సెమీస్ లో ఆసీస్ పై భారత్ గెలుస్తుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత టీమ్ లో ఆటగాళ్లంతా మంచి ఫామ్ లో ఉన్నారని, తప్పకుండా ఆసీస్ పై విజయం సాధించాలని కోరుకున్నారు. ఇప్పటికే దుబాయ్ లో వరుసగా మూడు మ్యాచ్ లు విజయ సాధించిన ఉత్సాహంలో ఉందని, అదే జోరులో కంగారూలపై కూడా గెలుస్తారని పేర్కొన్నారు. ఎనిమిది జట్లు ఆడుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఒక్క భారత్ మాత్రమే ఇప్పటివరకు అజేయంగా నిలిచింది. గ్రూపు దశలో ఆడిన బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ పై విక్టరీ సాధించింది. ఇక హైబ్రీడ్ మోడల్లో ఈ టోర్నీ జరుగుతుండటంతో భారత్ ఆడే మ్యాచ్ లు ఇక్కడ జరుగుతుండగా, మిగతా జట్ల మ్యాచ్ లన్నీ ఆతిథ్య పాక్ లో జరుగుతున్నాయి.
నలుగురు స్పిన్నర్లతో..
మ్యాచ్ ముందుగా వ్యాఖ్యానించినట్లుగానే భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో టీమిండియాను నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దించాడు. గత మ్యాచ్ లో ఐదు వికెట్లతో సత్తా చాటిన వరుణ్ చక్రవర్తిని ఈ మ్యాచ్ లోనూ ఆడిస్తుండటంతో మరో పేసర్ హర్షిత్ రాణాను రిజర్వ్ కే పరిమితం చేసింది. ఇక ఆసీస్ జట్టులోనూ రెండు మార్పలు జరిగాయి. గాయం కారణంగా ఓపెనర్ మథ్యూ షార్ట్, పేసర్ స్పెన్సర్ జాన్సన్లు ఈ మ్యాచ్ లో ఆడటం లేదు. వారి స్థానంలో కూపర్ కన్నోలీ, జాసన్ సంగాను తుదిజట్టులోకి తీసుకుంది. ఇక టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ టోర్నీలో అనుభవం లేని పేసర్లతో ఆసీస్ ఆడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హేజిల్ వుడ్, మిషెల్ స్టార్క్ గాయాలతో టోర్నీకి దూరమయ్యారు.