Beth Mooney Stunning 50: డబ్ల్యూపీఎల్ 2025 సీజన్ లో గుజరాత్ జెయింట్స్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో యూపీ వారియర్జ్ పై భారీ విజయాన్ని సాధించింది. లక్నోలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ బేత్ మూనీ స్టన్నింగ్ ఫిఫ్టీ (59 బంతుల్లో 96 నాటౌట్, 17 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకుంది. బౌలర్లో సోఫీ ఎకిల్ స్టోన్ రెండు వికెట్లతో సత్తా చాటింది. అనంతరం ఛేదనలో ఏ దశలోనూ విజయం వైపు యూపీ పయనించలేదు. కేవలం 17.1 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. చెనెల్ హెన్రీ (28) టాప్ స్కోరర్ గా నిలిచింది. కశ్వీ గౌతమ్, తనూజా కన్వర్ మూడేసి వికెట్లు తీసి సత్తా చాటారు. తాజా విజయంతో భారీ రన్ రేట్ సాధించి, ప్లే ఆఫ్ ఆశలను గుజరాత్ సజీవంగా ఉంచుకుంది. అలాగే టేబుల్ రెండో స్థానానికి ఎగబాకింది. బేత్ మూనీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ మ్యాచ్ లు ఉండటంతో మంగళ, బుధవారాల్లో టోర్నీకి సెలవు. గురువారం జరిగే లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో గుజరాత్ అమీతుమీ తేల్చుకోనుంది.
ధనాధన్ ఇన్నింగ్స్..
ఈ టోర్నీలో స్థాయికి తగ్గట్లు అంతగా ఆడకపోయినా, ఈ మ్యాచ్ లో మాత్రం మూనీ జూలు విదిల్చింది. కిల్లింగ్ ఇంటెంట్ తో వచ్చిన ఆమె.. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడింది. ఆరంభంలోనే మరో ఓపెనర్ డయాలాన్ హేమలత (2) వికెట్ కోల్పోయినా, ఏమాత్రం వెనుకంజ వేయలేదు. హర్లీన్ డియోల్ (32 బంతుల్లో 45, 6 ఫోర్లు)తో రెండో వికెట్ కు 101 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. తను ఔటన తర్వాత మిగతా బ్యాటర్లు ఎక్కువ స్ట్రైక్ మూనీకే ఇచ్చారు. సూపర్ టచ్ లో కనిపించిన మూనీ, బౌండరీలతో విరుచుకు పడింది. కేవలం 37 బంతుల్లోనే ఫిఫ్టీ చేసిన మూనీ.. ఆఖర్లో వేగంగా ఆడి మరో 22 బంతుల్లో 46 పరుగులు జోడించింది. దియోంద్ర డాటిన్ (17) మిడిలార్డర్లో చక్కని సహాకారం అందించింది. మిగతా బౌలర్లలో హెన్రీ, కెప్టెన్ దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ కు తలో వికెట్ దక్కింది.
ప్లాప్ షో..
భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో యూపీకి శుభారంభం దక్కలేదు. మేటి బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో 48-6తో పీకల్లోతు కష్టాల్లో పడింది. మధ్యలో గ్రేస్ హారిస్ (25) కాస్తా పోరాడినా అది ఫలితం లేకుండా పోయింది. ఈ దశలో ఉమా ఛెత్రి (17) తో కలిసి హెన్రీ.. 35 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చివర్లో సోఫీ ఎకిల్ స్టోన్ (14) కాస్త పోరాడటంతో జట్టు స్కోరు వంద పరుగుల మైలురాయిని దాటింది. మిగతా బౌలర్లలో డాటిన్ కు రెండు, మేఘన సింగ్, యాష్లే గార్డెనర్ లకు తలో వికెట్ దక్కింది. ప్రత్యర్థిని కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఉక్కిరి బిక్కిరి చేసి గుజరాత్ బౌలర్లు సత్తా చాటారు.