IPL 2025 Live Updates: డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్.. ఐపీఎల్ 2025కి సంబంధించి తమ కెప్టెన్ ను ప్రకటించింది. వెటరన్ ప్లేయర్, టీమిండియా ఆటగాడు అజింక్య రహానేను తమ సారథిగా ప్రకటించింది. గతంలో వివిధ జట్లకు కెప్టెన్సీ చేసిన అనుభవం రహానే సొంతం. ఈ సీజన్ లో అతడిని వేలంలో రూ.కోటిన్నరకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఉన్న జట్లలో అతి తక్కువ ఐపీఎల్ ప్రైస్ ఉన్న ఆటగాడు కేవలం రహానేనే కావడం విశేషం. అతనికి డిప్యూటీగా మధ్యప్రదేశ్ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ను సెలెక్టు చేశారు. గత మెగావేలంలో రూ.23.75 కోట్లకు కేకేఆర్ అతడిని కొనుగోలు చేసింది. దీంతో అతడినే కెప్టెన్ గా ఎంపిక చేస్తారని అందరూ భావించినా చివరకు అనుభవానికే పెద్ద పీట వేసింది. అనుభవజ్ఞుడైన రహానే సారథ్యంలో ఈ సీజన్ లో తమ టైటిల్ ను డిఫెండ్ చేసుకుంటామని ఆ జట్టు సీఈఓ వెంకీ మైసూర్ తెలిపాడు. ఇక ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో కేకేఆర్ ఒకటి. మూడుసార్లు టైటిల్ సాధించి సత్తా చాటింది.
సమాతూకంగా ఉంది..
కెప్టెన్ గా ఎంపికైన రహానే మాట్లాడుతూ.. కేకేఆర్ కెప్టెన్ గా ఎంపిక కావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ సారి జట్టు మరింత సమతూకంతోపాటు పటిష్టంగా ఉందని, తమ టైటిల్ ను డిఫెండ్ చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. గతేడాది కేకేఆర్ కు కప్పు అందించిన శ్రేయస్ అయ్యర్ అనూహ్యంగా వేలంలోకి వచ్చాడు. తనను పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. 26.75 కోట్లకు శ్రేయస్ ను పంజాబ్ సొంతం చేసుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గత సీజన్ కెప్టెన్ రిషభ్ పంత్.. కూడా మెగావేలంలోకి రాగా, అతడిని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కొనుగోలు చేసింది. ఇలా కొన్ని జట్ల మధ్య కెప్టెన్సీ మార్పు జరిగింది. ఆర్సీబీ జట్టు కెప్టెన్ గా రజత్ పాటిదార్ ఎంపికయ్యాడు. ఐపీఎల్లో కెప్టెన్ గా వ్యవహరించడం అతనికిదే తొలిసారి.
22 నుంచి ఐపీఎల్ స్టార్ట్..
ఐపీఎల్ 2025 ఈనెల 22 నుంచి ప్రారంభం అవుతోంది. తొలి మ్యాచ్ లో భాగంగా కేకేఆర్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఆ తర్వాత రోజు హైదరాబాద్ లో ఐపీఎల్ సమరం స్టార్ట్ కాబోతోంది. ఉప్పల్ మైదానంలో తొలి మ్యాచ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడుతుంది. రాజస్థాన్ రాయల్స్ తో ఢీకొననుంది. అదే రోజు ఎల్ క్లాసికో మ్యాచ్ అయిన ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మద్య మ్యాచ్ జరుగుతుంది.