Agnipath Protests In Hyderabad: అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకాన్ని నిరసిస్తూ చేపట్టిన నిరసనలో ఆర్పీఎఫ్ పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియ (అగ్నిపథ్)ను నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో రైల్వే పోలీస్ కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ మరణంపై కేసీఆర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు.


రాకేష్ కుటుంబానికి అండగా తెలంగాణ ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బలైపోయిన బీసీ యువకుడు రాకేష్ కుటుంబానికి సీఎం కేసీఆర్ తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబానికి 25 లక్షల పరిహారంతో పాటు, ఆ కుటుంబంలో అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లనే రాకేష్ బలయ్యిండని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని సీఎం కేసీఆర్ చేశారు. 






అక్క స్ఫూర్తితో ఆర్మీలో చేరాలనుకున్నాడు..
అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ లో ఆర్మీ అభ్యర్థులు నిరసన చేపట్టారు. అది ఉద్రిక్తతలకు దారి తీయగా.. పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని దబీర్ పేటకు చెందిన రాకేశ్ అనే యువకుడు చనిపోయాడు. రాకేశ్‌ కొన్ని నెలలుగా ఆర్మీలోకి వెళ్లేందుకు ట్రైనింగ్ అవుతున్నాడు. ఈ మధ్య జరిగిన పరీక్షల్లో కూడా పాల్గొన్నాడు. ఆ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన వివాదంలోనే సికింద్రాబాద్‌లో విధ్వంసం జరిగింది. ఆ ఉద్యోగాల కోసమే ఆందోళనలో పాల్గొని ఇలా పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. రాకేశ్‌ తండ్రి కుమార స్వామి దబీర్‌పేటలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆయనకు నలుగురు పిల్లలు. అందులో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. రాకేశ్‌ సోదరి సంగీత ఇప్పటికే సైన్యంలో పని చేస్తున్నారు. ఆమె పశ్చిబెంగాల్‌లోని బీఎస్‌ఎఫ్‌ జవాన్‌గా ఉన్నారు. ఆమె స్ఫూర్తితోనే ఆర్మీలోకి వెళ్లాలని భావించాడు రాకేశ్. కానీ ఇలా ఉద్యోగాల కోసం జరిగిన ఉద్యమంలో కన్నుమూశాడంటూ కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. 


Also Read: Agnipath Protest In Secundrabad: సోదరిలా సైన్యంలోకి వెళ్దామనుకున్నాడు- కానీ పోలీసు తూటాకు బలయ్యాడు 


Also Read: TS Govt Jobs : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్