TS Govt Jobs :  నిరుద్యోగుల‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మ‌రో 10 వేల ఉద్యోగాల భ‌ర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిల్లో గురుకులాల్లో మొత్తం 9,096 పోస్టులున్నాయి. మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థలో 1,445 పోస్టులు, బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. టీఎస్పీఎస్సీ ద్వారా మ‌రో 995 పోస్టులు భ‌ర్తీ చేసేందుకు సర్కార్ అనుమ‌తి ఇచ్చింది. దీంతో ఇప్పటివ‌ర‌కూ వివిధ శాఖ‌ల్లో ఉన్న 45,325 ప్రభుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది. 



10 వేల ఉద్యోగాలకు ఆర్థికశాఖ ఉత్తర్వులు


తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పోస్టులను గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖలో 316 పోస్టులు, మహిళా శిశుసంక్షేమశాఖలో 251 పోస్టులు, బీసీ సంక్షేమశాఖలో 157,  దివ్యాంగశాఖలో 71, గిరిజన సంక్షేమశాఖలో 78,  జువైనల్‌ వెల్ఫేర్‌లో 66 పోస్టులు సహా ఇతర 995 ఉద్యోగాలను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. 


మంత్రి హరీశ్ రావు ట్వీట్


మహిళా శిశుసంక్షేమశాఖలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా మరో 14 పోస్టులు భర్తీ చేయనున్నారు. తాజా ఉత్తర్వులతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 45,325 ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతిచ్చింది. ఉద్యోగాల భర్తీ అంశాన్ని ఆర్థికమంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొందరు చేసే ఉద్యోగ ప్రకటనలు జుమ్లా మాత్రమేనని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటికే 45,325 ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చారని ప్రకటించారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఉంటాయని పేర్కొన్నారు. 






Also Read : CM Jagan Review Job Calendar : నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, 8 వేల ఉద్యోగాలు భర్తీకి ఆదేశాలు