అగ్నిపథ్‌ స్కీమ్‌ను వ్యతిరేకించిన యువత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం సృష్టించారు. పక్కా ప్లాన్‌తో రైల్వేస్టేషన్‌లో ఆందోళన చేయడానికి వచ్చిన వారంతా రాత్రి నుంచి స్టేషన్‌లోనే ఉన్నారు. మరికొందరు స్టేషన్ చుట్టుపక్కల తలదాచుకున్నారు. అనుకున్న టైంకు తమ ప్లాన్ వర్కౌట్ చేశారు. అయితే ఆ ఆందోళనలను పోలీసులు అడ్డుకోవడంతో యువత రెచ్చిపోయింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో బీభత్సం సృష్టించారు. 


రాళ్లు రువ్వుతూ రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన ఆందోళనకారులను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు పోలీసులు. అయినా నిరసనకారులు దారికి రాలేదు. కాల్పులు జరపాల్సి ఉంటుందని చెప్పినా సరే వినిపించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అప్పటికే స్టేషన్‌లో విధ్వంసం కాండ ప్రారంభమైంది. 


సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో చేయిదాటిపోయిన పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు స్పాట్‌లోన చనిపోయాడు. దీంతో నిరసనకారులు మరింతగా రెచ్చిపోయారు. రైల్వేస్టేషన్‌లో కనిపించిన వాటన్నింటినీ ధ్వంసం చేశారు. 


పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని దబీర్ పేటకు చెందిన రాకేశ్ అనే కుర్రుడా చనిపోయాడు. రాకేశ్‌ కొన్ని నెలలుగా ఆర్మీలోకి వెళ్లేందుకు ట్రైనింగ్ అవుతున్నాడు. అలా ఈ మధ్య జరిగిన పరీక్షల్లో కూడా పాల్గొన్నాడు. ఆ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన వివాదంలోనే సికింద్రాబాద్‌లో విధ్వంసం జరిగింది. ఆ ఉద్యోగాల కోసమే ఆందోళనలో పాల్గొని ఇలా పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. 
రాకేశ్‌ తండ్రి కుమార స్వామి దబీర్‌పేటలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆయనకు నలుగురు పిల్లలు. అందులో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. రాకేశ్‌ సోదరి సంగీత ఇప్పటికే సైన్యంలో పని చేస్తున్నారు. ఆమె పశ్చిబెంగాల్‌లోని బీఎస్‌ఎఫ్‌ జవాన్‌గా ఉన్నారు. ఆమె స్ఫూర్తితోనే ఆర్మీలోకి వెళ్లాలని భావించాడు రాకేశ్ . కానీ ఇలా ఉద్యోగాల కోసం జరిగిన ఉద్యమంలో కన్నుమూశాడు. 


పోలీసులు జరిపిన కాల్పుల్లో రాకేశ్ చనిపోగా... వినయ్ అనే కుర్రాడు గాయాలపాలయ్యాడు. చాతీలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. మహబూబాబాద్‌ జిల్లా గార్లమండలం మద్దవంచ వాసిన వినయ్. ప్రస్తుతం వినయ్‌కు గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.