TRS On Agnipath Protests: ఉత్తరాదిన బిహార్, యూపీ లాంటి రాష్ట్రాలతో పాటు నేడు దక్షిణాదిన తెలంగాణలోనూ కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పథకం అగ్నిపథ్‌పై అల్లర్లు మొదలయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వేల సంఖ్యలో చేరుకున్న కొందరు ఆందోళనకారులు అక్కడి స్టాల్స్‌పై దాడులు చేశారు. అంతటితో శాంతించని అల్లరి మూక కొన్ని రైళ్లకు సైతం నిప్పు పెట్టింది. పోలీసులపై రాళ్లు రువ్వి ఆందోళనకారులు విధ్వంసానికి దిగడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు చనిపోగా, దాదాపు 10 మంది వరకు గాయపడ్డారు. శాంతిభద్రతలకు మరింత భంగం వాటిల్లకుండా హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను, మెట్రో రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. సికింద్రాబాద్ అల్లర్లపై స్పందించిన టీఆర్ఎస్ పార్టీ అగ్నిపథ్ పథకాన్ని మోదీ సర్కార్ తీసుకొచ్చిన అనాలోచిత చర్య అని వ్యాఖ్యానించింది.
కేంద్రం తీసుకున్న అనాలోచిత చర్యతో ఆర్మీ ఉద్యోగార్థులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. దురదృష్టవశాత్తు దేశంలో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని టీఆర్ఎస్ నేతలు ట్వీట్ చేశారు. యువత సంయమనం పాటించాలని, శాంతియుత నిరసనల ద్వారా తమ హక్కులు సాధించుకోవాలని రిక్వెస్ట్ చేసింది. అహింసకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, కానీ మీరు కోరుకున్న డిమాండ్లను సాధించుకునేందకు శాంతియుతంగా పోరాటం చేయాలని సూచించింది.
కాల్పుల్లో ఒకరు మృతి
సికింద్రాబాద్ కాల్పుల్లో చనిపోయిన యువకుడ్ని వరంగల్ జిల్లా వాసిగా గుర్తించారు. రంగల్ జిల్లాకు చెందిన రాకేష్‌గా పోలీసులు గుర్తించారు. ఖానాపురం మండలం దబీర్‌పేటకు చెందిన రాకేష్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడని ఈ మేరకు పోలీసులకు రైల్వే అధికారులు సమాచారం ఇచ్చారు. రాకేష్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Also Read: Hyderabad Metro Rail Services: హైదరాబాద్‌లో హై అలెర్ట్ - మెట్రో రైలు సర్వీసులు నిలిపివేసిన అధికారులు