Agnipath Protests In Hyderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అల్లర్ల నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా మెట్రో రైలు సర్వీసులను నిలిపివేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు అధికారులు ముందస్తు చర్యలలో భాగంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి నిర్ణయాన్ని ప్రకటించారు. నగరంలో పలు ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు సైతం రద్దయ్యాయి.
ముందు జాగ్రత్తగా ఎంఎంటీఎస్ సేవలు రద్దు..
నగరంలో నెలకొన్న కొన్ని పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ లోని మూడు లైన్లలో మెట్రో రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశాం. మెట్రో రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి, ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోవాలి. తదుపరి ప్రకటన వచ్చే వరకు హైదరాబాద్‌లో మెట్రో రైలు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
తెలంగాణలో రైల్వే స్టేషన్లలో హైఅలెర్ట్..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల చెలరేగిన ఆందోళన, హింసతో తెలంగాణలోని ఇతర రైల్వేస్టేషన్లు, ఏపీలోని విజయవాడ సహా మిగతా రైల్వే స్టేషన్లలో అలెర్ట్ ప్రకటించారు. నిన్నటివరకూ శాంతియుతంగా జరిగిన అగ్నిపథ్ నిరసన నేడు తీవ్రరూపం దాల్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది.
చివరకు కాల్పులకు సైతం దారితీసింది. ఇదివరకే తెలంగాణలో నాంపల్లి రైల్వేష్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలో రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్, జీఆర్పీ నుంచి అదనపు బలగాలను రైల్వేస్టేషన్లకు రప్పించి భద్రతను పెంచుతున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. లింగంపల్లి నుంచి నాంపల్లి, హైదరాబాద్ నుంచి లింగంపల్లి, ఫలక్ నుమా - లింగంపల్లి, రామచంద్రాపురం - ఫలక్‌నుమా ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను సైతం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.