Agnipath Protests In Hyderabad: అగ్నిపథ్ ఆందోళనలు దక్షిణాదికి కూడా పాకాయి. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్‌ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. అనంతరం రైల్వేస్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు ఫ్లాట్‌ఫారమ్‌ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. పలు రైళ్లకు నిప్పు పెట్టారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అగ్నిగుండంగా మారింది.






అగ్గిరాజేసిన ఆందోళన


నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. వందలాది మంది కర్రలు, రాళ్లతో పోలీసులపై కూడా దాడికి దిగారు.






అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ వందల మంది ఆర్మీ అభ్యర్థులు విధ్వంసానికి దిగారు. రైళ్లకు, స్టాళ్లకు ఆర్మీ అభ్యర్థులు నిప్పు పెట్టారు. రైళ్లపై రాళ్లు విసరడంతో భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ఆర్మీ అభ్యర్థుల దాడిలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.


కాల్పుల వార్నింగ్


అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యధాతథంగా నిర్వాహించాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి చేయిదాటడంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌లో అన్ని రైళ్లను అధికారులు నిలిపేశారు. రైల్వేస్టేషన్‌ వద్ద ఆర్టీసీ బస్సులను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు.


ఆర్మీ అభ్యర్థుల ఆకస్మిక దాడితో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఏం జరగుతుందో తెలిసేలోపే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అగ్నిగుండంగా మారింది. రైల్వేస్టేషన్‌లో విధ్వంసకాండ కొనసాగుతోంది. ఆందోళనకారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. నిరసనలు ఆపి రైల్వేస్టేషన్‌ను ఖాళీ చేయకపోతే కాల్పులు చేస్తామని హెచ్చరించారు.



Also Read: Agneepath Recruitment Scheme: అగ్నిపథ్‌తో సైన్యానికి లాభమా, నష్టమా- ప్రభుత్వం ఏం చెబుతోంది


Also Read: Agnipath Scheme Protest: అగ్గిరాజేస్తున్న అగ్నిపథ్ పథకం, బిహార్‌లో తీవ్రస్థాయి నిరనసలు