అగ్నిపథ్ పథకంపై బిహార్‌లో నిరసనలు
కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయంగా చెప్పుకుంటున్న అగ్నిపథ్ పథకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్రివిధ దళాల నియామక ప్రక్రియలో ఇదో కొత్త ఒరవడికి నాంది అని కేంద్రం వివరిస్తున్నా..కొన్ని వర్గాలు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. మాజీ సైనికాధికారులే ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అలజడి రేపటమే కాక, అల్లర్లకూ కారణమవుతోంది. బిహార్‌లో ఇప్పటికే తీవ్ర స్థాయి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బక్సర్, బెగుసరై, ముజఫర్‌పూర్ ప్రాంతాల్లోని రహదారులు దిగ్బంధించారు నిరసనకారులు. త్రివిధ దళాల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థులంతా బక్సర్, బెగుసరై జాతీయ రహదారులపై రాస్తారోకో చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వందలాది మంది నిరసనకారులు రైల్వే ట్రాక్‌లనూ దిగ్బంధించారు. ఈ నిరసనల కారణంగా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను 17 నిముషాలపాటు నిలిపివేశారు.
ఉద్యోగ భద్రత లేకుండా చేస్తారా-నిరసనకారుల ప్రశ్న
రైల్వే ఉన్నతాధికారులతో పాటు ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
కేవలం నాలుగేళ్ల కోసమే తమను సర్వీస్‌లోకి తీసుకుంటే తరవాత సంగతేంటని ప్రశ్నిస్తున్నారు అభ్యర్థులు. ఉద్యోగ భద్రత లేకుండా చూస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు. నాలుగేళ్ల తరవాత తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఏజ్ లిమిట్‌ను 21ఏళ్లకే పరిమితం చేయటంపైనా అసహనం వ్యక్తమవుతోంది. రైతు కుటుంబాల నుంచి వచ్చే అభ్యర్థులకు ఇలాంటి పరిమితులు విధించి ఉద్యోగాలకు దూరం చేయడమేంటన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. కేవలం 25% మందికే శాశ్వత కేడర్‌లో పని చేసేందుకు అవకాశం కల్పించటం సరైన నిర్ణయం కాదన్నది ఇంకొన్ని వర్గాల వాదన.
ఈ ప్రయోగాలు దేనికి..?-ప్రియాంక గాంధీ
రాజకీయంగానూ ఈ నిర్ణయం కాక రేపుతోంది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అగ్నిపథ్ స్కీమ్‌పై నిప్పులు చెరిగారు. సైనిక బలగాల నియామకం విషయంలో ప్రయోగాలు చేయటమేంటని విమర్శించారు. దేశ రక్షణలో కీలకంగా వ్యవహరించే సైనికులను భాజపా భారంగా భావిస్తోందంటూ మండి పడ్డారు. కొందరు సీనియర్ ఆర్మీ అధికారులు కూడా కేంద్రం నిర్ణయంపై అసంతృప్తితోనే ఉన్నారు. పూర్తిస్థాయిలో శిక్షణ పొందటానికి కనీసం నాలుగేళ్లు పడుతుందని, అలాంటిది కేవలం ఆర్నెల్లలో శిక్షణనిచ్చి సర్వీస్‌లోకి తీసుకుంటామనటం సరికాదని అంటున్నారు. పలువురు రక్షణ రంగ నిపుణులు కూడా ఇదే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయుధాలు ఎలా వినియోగించాలో పూర్తిగా తెలిసే నాటికే వాళ్లు సర్వీస్‌లో నుంచి దిగిపోతారని, ఈ తాత్కాలిక రిక్రూట్‌మెంట్ వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని స్పష్టం చేస్తున్నారు. మరి కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా, అనుకున్నట్టుగానే అమలు చేస్తుందా అన్నది చూడాలి.