అగ్నిపథ్‌కు ఎవరు అర్హులు..?
కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వినిపిస్తున్న మాట అగ్నిపథ్. సైనికుల నియామకంలో కొత్త ట్రెండ్‌కి ఇది నాంది పలుకుతుందని కేంద్రం చాలా గట్టిగా చెబుతోంది. యువతకు అధిక ప్రాధాన్యతనిచ్చేలా ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఇటీవలే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఇదో చరిత్రాత్మక నిర్ణయమని, మొదటి విడతలో 46 వేల మందిని సైనికులుగా తీర్చి దిద్దుతామంటూ వెల్లడించింది కేంద్రం. త్రివిధ దళాల్లో నాలుగేళ్ల పాటు వీళ్లు విధులు నిర్వహిస్తారు. సైన్యంలోకి యువరక్తాన్ని ఆహ్వానించటం ద్వారా భారత్ మరింత శక్తిమంతమవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
ఇవీ లాభాలు
రెగ్యులర్ సైనికులకు అందించే పెన్షన్లు, జీతాలు కోసం చేసే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చని భావిస్తోంది. ఈ అగ్నిపథ్ సర్వీస్‌లో చేరేందుకు 17.5-21 ఏళ్ల వాళ్లు అర్హులు. ఎంపికైన వారికి ఆర్నెల్ల పాటు శిక్షణ అందించి మూడున్నరేళ్ల పాటు సర్వీసులో ఉంచుతారు. ఈ నాలుగేళ్లు పూర్తయ్యాక ప్రతిభ ఆధారంగా 25% మందిని శాశ్వత కమిషన్‌లో పని చేసేందుకు అవకాశం కల్పిస్తారు. మంచి ప్యాకేజీ కూడా అందిస్తారు. తొలి సంవత్సరం రూ.4.76 లక్షల ప్యాకేజీ అందిస్తారు. వీరిని అగ్నివీరులుగా అభివర్ణిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ రిక్రూట్‌మెంట్ విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అగ్నిపథ్ తీసుకురావటానికి కారణమిదే..
ఈ అగ్నిపథ్ సర్వీస్‌ని ప్రారంభించాలని ఐడియా 2020లోనే వచ్చిందట. ఇది మాజీ సైనికాధ్యక్షుడు బిపిన్ రావత్ ఆలోచన. సైన్యం కోసం చేస్తున్న ఖర్చుని వీలైనంత వరకూ తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ ఆలోచన చేశారట. అయితే ఈ ప్రక్రియను కేవలం జవాన్లకే పరిమితం చేయాలని భావిస్తోంది కేంద్రం. ఉన్నతాధికారులకు సంబంధించి ఇప్పటికే షార్ట్ సర్వీస్ కమిషన్ అందుబాటులో ఉంది. ఆఫీసర్ క్యాడర్ వాళ్లను రిక్రూట్ చేసుకుని ఐదేళ్ల పాటు సర్వీస్‌లో కొనసాగిస్తారు. కానీ ఇప్పటికే ఈ రిక్రూట్‌మెంట్‌పై కాస్త అసహనం వ్యక్తమవుతోంది. చాలా కొద్ది మంది మాత్రమే పర్మినెంట్ అవుతుండటమే ఇందుకు కారణం. ఈ ఆఫీసర్‌లకు శిక్షణనిచ్చేందుకు ఏటా రూ.6కోట్లు ఖర్చు చేస్తున్నారని అంచనా. కానీ ఇలా ఐదేళ్ల సర్వీస్ ముగించుకున్న వాళ్లకి పెన్షన్లు రావటం లేదు. కనీసం మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వటం లేదని చాలా మంది అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి అగ్నిపథ్ లాంటి తాత్కాలిక రిక్రూట్‌మెంట్ ప్రక్రియను తీసుకురావటంపై కొందరు సీనియర్లు పెదవి విరుస్తున్నారు. కఠినమైన ఎంపిక ప్రక్రియను దాటుకుని వస్తే రెగ్యులర్ క్యాడర్‌లోకి తీసుకుంటామని కేంద్రం చెబుతున్నా ఈ అవకాశాలు చాలా తక్కువేనన్నది కొందరి అభిప్రాయం.
భిన్నాభిప్రాయాలు ఎందుకు..?
సాధారణంగా ఓ సైనికుడు అన్ని విధాలుగా శిక్షణ పొంది పోరాడేందుకు సిద్ధ పడాలంటే కనీసం 6-7 ఏళ్లు పడుతుందన్నది సీనియర్ల అభిప్రాయం. అలాంటికి కేవలం ఆర్నెల్లలో ట్రైనింగ్ ఇచ్చి రంగంలోకి దింపుతామంటే అది సాధ్యం కాని పని అని కొందరు గట్టిగానే వాదిస్తున్నారు. పూర్తి స్థాయి అవగాహన వచ్చే నాటికి సర్వీస్ నుంచి దిగిపోతారు. చైనా, పాకిస్థాన్‌తో సరిహద్దు పంచుకునే ప్రాంతాల్లో భారత జవాన్లు ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాస్తుంటారు. కేవలం నాలుగేళ్ల పాటు పని చేసేందుకు వచ్చే సైనికులు అంత ధైర్యసాహసాలు చూపించి పోరాడతారా అన్నదీ ప్రశ్నార్థకమే అన్నది డిఫెన్స్ ఎక్స్‌పర్ట్ పీకే సెహగల్ అభిప్రాయం. పైగా వీరిలో కేవలం 25% మంది మాత్రమే పర్మినెంట్ అవుతారని కేంద్రం చెబుతోంది. ఆర్మీలో పూర్తి స్థాయి శిక్షణ పొందిన వారి సంఖ్య ఇంత తక్కువగా ఉంటే ఎలా అన్న వాదనా వినిపిస్తోంది.